Share News

మహిళలను అవమానిస్తే సహించేది లేదు.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం

ABN , Publish Date - Nov 20 , 2026 | 02:47 PM

నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో నిర్వహించిన సమావేశం రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మహిళలను అవమానిస్తే సహించేది లేదు.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం
Seethakka

నిజామాబాద్, నవంబరు 20: ముప్కాల్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను మంత్రిగా ఉండటాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వెంట పడుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాళ్లు మొక్కించుకునే సంస్కృతికి చెందిన వ్యక్తిని కాదని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కాళ్లు మొక్కించుకునే వారిని తరిమికొట్టే సంస్కృతి తనదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కరోనా వంటి కష్టకాలంలో సైతం తాను ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని గుర్తుచేశారు. ఆ సమయంలో కూడా కొందరు తన సేవలను గుర్తించకుండా హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం కష్టపడిన తనపై నేడు రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన 'సిగ్గుండాలి' అనే వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏ విధమైన రాజకీయ సంస్కారమని ప్రశ్నించారు. మహిళలను అవమానించే వారి వెంట పడి కొట్టిన చరిత్ర తనదని, మహిళల ఆత్మగౌరవం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా మహిళలను అవమానించే స్థాయికి దిగజారడం సరికాదని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే సంస్కారం ఇదేనా? అంటూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిలదీశారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవం గురించి మాట్లాడే సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ముప్కాల్ వేదికగా సీతక్క చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి..

గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్

బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..

Updated Date - Nov 20 , 2026 | 04:01 PM