Share News

యావన్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన సికింద్రాబాద్ డీసీపీ

ABN , Publish Date - May 11 , 2026 | 04:51 PM

సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో రెండు రోజుల క్రితం యావన్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు.

యావన్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన సికింద్రాబాద్ డీసీపీ
Yuvan Case

హైదరాబాద్, మే 10: సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో రెండు రోజుల క్రితం యావన్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. యావన్‌ తన స్నేహితులతో కలిసి చిలకలగూడలో ఓ ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేశారు. తల, గొంతు, శరీరభాగాల్లో తీవ్రమైన కత్తిపోట్లు కావడంతో యావన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా యావన్ హత్యకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు.


'ఈనెల 7వ తేదీన చిలకలగూడ పీఎస్ ప్రాంతంలో జరిగిన యావన్ హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశాము. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. కేసు విచారణ కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ కేసులో సాయి కిరణ్ మొదటి నిందితుడు. అతడే యావన్ హత్యకు ప్లాన్ చేశాడు. అరెస్టైన వారిలో యువతి తండ్రి నరసింహ యాదవ్, బాబాయ్‌లు మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఉన్నారు. వీరితో పాటు అమ్మాయి బ్రదర్ పరమేష్ , అలానే ఓ మైనర్ కూడా ఉన్నాడు' అని డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు.


'పక్కా ప్లాన్ చేసి.. యావన్‌ను హత్య చేశారు. హత్యకు నాలుగు రోజుల ముందు నుంచే యావన్‌ను చంపేందుకు ప్లాన్ చేశారు. మేడిబావి ప్రాంతానికి వస్తే యావన్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. 7వ తేదీన యావన్ తన స్నేహితుడైన సుబ్బు ఇంటికి వద్దకు వచ్చాడు. అదే సమయంలో గ్యాంగ్ వచ్చి యావన్‌తో గొడవ పడ్డారు. ఆ సమయంలో ఒకరు కత్తితో యావన్‌ను పొడిచారు. అనంతరం మిగిలిన నిందితులు కూడా యావన్‌ను కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడి యావన్‌ను స్నేహితులు గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు' అని డీసీపీ వెల్లడించారు.


'యావన్‌కు ఒక యువతితో స్కూల్ డేస్ నుంచి పరిచయం ఉంది. గత రెండేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో అతన్ని హెచ్చరించారు. అయినా యావన్ అలానే అమ్మాయితో ప్రేమ కొనసాగించాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ద్విచక్ర వాహనం మొబైల్ ఫోన్లు సీజ్ చేశాం. నిందితులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించాం. అందులో రాహుల్, శివలకు గంజాయి పాజిటివ్ వచ్చింది' అని డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం కావాలి: సీఎం రేవంత్‌

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ

మోదీ ఆశీస్సులు, మార్గదర్శనం నాకు ఎప్పటికీ ప్రత్యేకం: పవన్ కల్యాణ్

Updated Date - May 11 , 2026 | 04:59 PM