Share News

Sankranti festival: గాలిపటమా.. పద పద..

ABN , Publish Date - Jan 15 , 2026 | 09:05 AM

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడచూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. నిన్న, భోగి, ఈరోజు పండుగ.. ఇలా ప్రతి ఇల్లు, ప్రతి వీధిలోనూ పండుగ కనిపిస్తోంది. రంగురంగుల ముగ్గులతో వీధులన్నీ నిండిపోయాయి.

Sankranti festival: గాలిపటమా.. పద పద..

- డీజే మోతలు.. పతంగుల సయ్యాటలు..

- ఆకాశంలో కనువిందు

- కట్టడి చేసినా చైనా మాంజాతోనే ఎగరవేతలు

- పరేడ్‌ గ్రౌండ్‌లో రెండో రోజూ ఉత్సాహంగా కైట్‌ ఫెస్టివల్‌

- వివిధ రకాల స్వీట్లను రుచి చూసిన నగరవాసులు

హైదరాబాద్‌ సిటీ: ‘చిలుకా పద పద.. నెమలి పద పద.. గాలిపటమా పద పద’ అంటూ ఓ సినిమాలో పతంగులను ఎగురవేస్తూ పాట పాడేది గుర్తుంది కదా.. అచ్చం అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ నేపథ్యంలో ఉత్సాహంగా పతంగులను ఎగురవేశారు. తీరొక్క పతంగుల సయ్యాటలు ఆకాశమంతా కనువిందు చేశాయి. పతంగులను ఎగరవేయడానికి యువత, చిన్నారులు పోటీపడ్డారు. చైనా మాంజాను కట్టడి చేసినా పతంగులతో పోటీ పడేందుకు వాటినే విరివిగా వినియోగించారు. చైనా మాంజా విక్రయాలు యథావిధిగా సాగాయి.


city5.2.jpg

అపార్ట్‌మెంట్‌ల వద్ద ప్రత్యేకం

పతంగుల ఎగురవేసే క్రమంలో వివిధ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, భవనాలపై డీజేలను ఏర్పాటు చేశారు. పాటల హోరుతో ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు.

రెండో రోజూ ఉత్సాహంగా కైట్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌: సంకాంత్రి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కైట్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి కైట్‌ ఫెస్టివల్‌ను తిలకించారు. దేశ, విదేశాలకు చెందిన కైట్‌ ఫ్లయర్స్‌ రకరకాల పతంగులను ఎగురవేయడంతో చిన్నారుల నుంచి పెద్దవారికి వరకు ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా స్వీట్‌ ఫెస్టివల్‌ కూడా నిర్వహిస్తుండగా సందర్శకులు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లు కొనుగోలు చేసి రుచిని ఆస్వాదించారు. ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహనకల్పించేందుకు యమ ధర్మరాజు వేషధారణలో విదేశీ కైట్‌ ఫ్లయర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో సెల్ఫీలు దిగుతూ సందర్శకులు సందడి చేశారు.


రెండు రోజుల ముందు నిర్వహిస్తే బాగుండేది

ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్‌ ఫెస్టివల్‌ సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందు నిర్వహిస్తే బాగుండేది. పండుగకు ఊరికి వెళ్లేవాళ్లు కూడా ఈ ఫెస్టివల్‌ చూసే అవకాశం ఉంటుంది. ఇంకా బాగా సక్సె్‌సగా ఓ జాతరను తలపించేది. ఫుడ్‌కు సంబంధించి ధరలు బయటితో పోలిస్తే డబుల్‌ ఉన్నాయి.

- ప్రవీణలత, సందర్శకురాలు


city5.3.jpg

కొత్త రకాల వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌లో కొత్త వంటకాలు ఏమీ కనిపించడంలేదు. నిత్యం మనకు మార్కెట్‌లో కనిపించేవి ఉన్నాయి. కౌంటర్లను టేబుల్‌ పైన కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. పానీపూరి చాట్‌ లాంటివి కాకుండా తెలంగాణ, ఆంధ్ర పిండి వంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మన తెలుగువారి రుచులు బయట వారికి తెలుస్తాయి.

- మాధవి, సికింద్రాబాద్‌


చాలా హ్యాపీగా ఉంది

నేను అల్జీరియా దేశం నుంచి వచ్చాను. హైదరాబాద్‌కు రావడం రెండోసారి. కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మేము చిన్న కైట్స్‌ తయారు చేసి ఎగురవేస్తాం. ఈగల్‌ కైట్స్‌ మా ప్రత్యేకత.

- సోఫియానా ఫ్రెమా, అల్జీరియా


కైట్స్‌ ఫ్లయింగ్‌ ప్రధాన క్రీడ

థాయిలాండ్‌ అసోసియేషన్‌ గాలి పటాల సంస్కృతి, క్రీడలను ప్రపంచానికి చాటి చెబుతుంది. మేము ఇండియాకు రావడం ఆరోసారి. హైదరాబాద్‌కు రావడం నాల్గో సారి. అన్ని అరేంజ్‌మెంట్‌లు చాలా బాగున్నాయి. చిన్న కైట్స్‌ నుంచి పెద్ద కైట్స్‌ను మేము తయారు చేసి వివిధ దేశాలకు సప్లయ్‌ చేస్తాం.

- నింగిబూమ్‌, థాయిలాండ్‌


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 09:05 AM