Share News

దోపిడీ ఆగట్లే

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:26 AM

బియ్యం ధరలు అదుపులోకి రావడం లేదు. వంటింటి బడ్జెట్టంతా బియ్యానికే పోతోందని కొన్నాళ్లుగా సామాన్య ప్రజల్లో నెలకొన్న ఆందోళన తగ్గడం లేదు.

దోపిడీ ఆగట్లే
rice

  • బియ్యం ధరలు తగ్గించాలన్న సర్కారు ఆదేశాలు బేఖాతరు

  • క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్ట్‌ పెడతామన్నా బెదరని వ్యాపారులు

  • కిలో బియ్యం రూ.85 నుంచి రూ.100 వరకు

  • బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు

  • స్టాక్‌ కోసం హోల్‌సేల్‌ వ్యాపారుల వద్దకు వెళ్లొద్దు

  • ఇండెంట్‌ సమర్పిస్తే మిలర్ల నుంచి నిల్వలు ఇప్పిస్తాం

  • రిటైల్‌ వ్యాపారులకు సివిల్‌ సప్లయ్స్‌ డైరెక్టర్‌ సూచన

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): బియ్యం ధరలు అదుపులోకి రావడం లేదు. వంటింటి బడ్జెట్టంతా బియ్యానికే పోతోందని కొన్నాళ్లుగా సామాన్య ప్రజల్లో నెలకొన్న ఆందోళన తగ్గడం లేదు. ప్రభుత్వం రంగంలోకి దిగి.. ధరలు తగ్గించండి.. లేదంటే కఠిన చర్యలు తీసుకంటాం అని గట్టిగా హెచ్చరించినా కూడా హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు డోంట్‌ ఖేర్‌ అంటున్నారు బియ్యం ధరల నియంత్రణ కోసం పౌరసరఫరాలశాఖ ధరల పట్టిక జారీ చేసినా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదుచేస్తున్నా వ్యాపారులు మాత్రం ధరలను తగ్గించడం లేదు. బియ్యం ధరల పేరుతో తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫలితంగా హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లలోనే కాకుండా ఆన్‌లైన్‌ మార్కెట్లోనూ బియ్యం ధరలు మండిపోతుండటంతో వినియోగదారుల బెంబేలెత్తిపోతున్నారు.

తాము ప్రకటించిన ధరలకే మార్కెట్లో బియ్యాన్ని విక్రయించాలంటూ ప్రభుత్వం ఇటీవల ధరల పట్టికను జారీ చేసింది. బీపీటీ, కూనారం సన్నాలను కిలో రూ.66 చొప్పున, ఆర్‌ఎన్‌ఆర్‌/తెలంగాణ సోనా బియ్యం కిలో రూ.74 చొప్పున, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం బియ్యం కిలో రూ. 79 వరకు విక్రయించాలని, అంతకంటే ఎక్కువ ధరలకు అమ్మొద్దని స్పష్టం చేస్తూ రైస్‌మిల్లరు, ట్రేడర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌, చిల్లర వర్తకులకు హెచ్చరికలు జారీచేసింది. బియ్యం నిల్వలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించొద్దని, అధిక ధరలకు విక్రయించినా, తూకాల్లో మోసాలకు పాల్పడినా క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని, పీడీ యాక్టు కూడా పెట్టేందుకు వెనకాడేదిలేదని స్పష్టం చేసింది.


ప్రభుత్వ హెచ్చరికలు, ఆకస్మిక దాడులు, మార్కెట్‌ పరిస్థితనులను గమనించిన కొందరు రైస్‌మిల్లర్లు కొంతమేరకు ధరలు తగ్గించారు. హోల్‌సేల్‌గా బీపీటీ బియ్యాన్ని కిలోకు రూ. 63 నుంచి రూ. 65 చొప్పున, ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యాన్ని రూ. 72 నుంచి రూ.74, జైశ్రీరాం బియ్యాన్ని రూ.75 నుంచి రూ.79 వరకు అమ్ముతున్నట్లు రైస్‌మిల్లర్లు చెబుతున్నారు.

మార్కెట్లో వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు గానీ, రైస్‌మిల్లర్లు తగ్గించినట్లు చెబుతున్న ధరలకు గానీ మార్కెట్లో బియ్యం దొరకటంలేదు. మరోవైపు మార్కెట్లో ధాన్యం ధరలు కూడా తగ్గాయి. ఇదివరకు ధాన్యం ధర క్వింటాకు రూ. 3,300 నుంచి రూ. 3,500 వరకు ఉండేది. ఇప్పుడు రూ. 3 వేలకు పడిపోయింది. సన్నరకాల ధాన్యం ధరలు తగ్గినప్పటికీ బియ్యం ధరలు తగ్గకపోవటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. వరంగల్‌ మార్కెట్లో జైశ్రీరాం బియ్యం ఽహోల్‌సేల్‌ ధర కిలోకు రూ. 95 ఉంది. రిటైల్‌ మార్కెట్‌ ధర రూ. 100 ఉంది. అంటే క్వింటాలుకు రూ. 9,500 నుంచి రూ. 10 వేల చొప్పున జైశ్రీరాం బియ్యం అమ్ముతున్నారు. హెచ్‌ఎంటీ బియ్యం ధర హోల్‌సేల్‌ మార్కెట్లో కిలోకు రూ.85 ఉండగా.. రిటైల్‌ ధర రూ. 90 ఉంది. నర్సంపేటలో జైశ్రీరాం బియ్యం హోల్‌సేల్‌ రేటు కిలోకు రూ. 98 ఉండగా... రిటైల్‌ ధర రూ. 100 పలుకుతోంది. హెచ్‌ఎంటీ బియ్యం హోల్‌సేల్‌ ధర రూ. 83 ఉండగా.. రిటైల్‌ ధర రూ. 88 ఉంది. అంటే హెచ్‌ఎంటీ బియ్యాన్ని క్వింటాకు రూ. 8,300 నుంచి రూ. 8,800 చొప్పున అమ్ముతున్నారు. ప్రభుత్వం మూడు కేటగిరీలుగా బియ్యం ధరలు ప్రకటించకముందు ఏవైతే ధరలు ఉన్నాయో ఇప్పుడూ అవే ధరలు మార్కెట్లో ఉన్నాయి. వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో నిల్వలు చేసి అధిక ధరలకు బియ్యం అమ్ముతున్నారు.


కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించబోం

బియ్యం అమ్మకాల్లో మధ్యవర్తుల జోక్యం అవసరంలేదని, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న హోల్‌సేల్‌ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ హెచ్చరించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, మధ్యవర్తుల కారణంగా బియ్యం సరఫరాలో ఇబ్బందులెదురైతే రిటైలర్లు వారి వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎ్‌సవో)ను సంప్రదించి తమకు అవసరమైన బియ్యం నిల్వలకోసం ఇండెంట్‌ సమర్పించాలని సూచించారు. తద్వారా రైస్‌మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కృత్రిమ కొరతపై వచ్చే వదంతులను నమ్మి ధరలు పెంచొద్దని రిటైల్‌ వ్యాపారులకు సూచించారు. వినియోగదారులను మోసంచేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని, 25 కిలోల బస్తాపై 26 కిలోలుగా ముద్రించటం, ఎమ్మార్పీ ధరలు దాచి అధిక ధరలతో కొత్త లేబుళ్లు అంటించటం లాంటి అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని, తనిఖీ బృందాల్లో వచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్‌ తెలిపారు. అక్రమంగా బియ్యం నిల్వచేయటం, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించటం, కృత్రిమంగా ధరలు పెంచటంచేస్తే ఉపేక్షించేదిలేదని, పదేపదే ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదుచేస్తామని హెచ్చరించారు.

బియ్యం అమ్మకాల్లో మధ్యవర్తుల జోక్యం అవసరం లేదు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న హోల్‌సేల్‌ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటాం. కృత్రిమ కొరతపై వచ్చే వదంతులను నమ్మి రిటైల్‌ వ్యాపారులు ధరలు పెంచొద్దు. వినియోగదారులను మోసంచేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా బియ్యం నిల్వచేయడం, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం, కృత్రిమంగా ధరలు పెంచడం చేస్తే ఉపేక్షించేది లేదు. పదేపదే ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం.

- పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌

ఇవి కూడా చదవండి..

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ

Updated Date - Nov 10 , 2026 | 03:52 AM