మేం సేవకులం
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:51 AM
నేనే రాజు.. నేనే మంత్రి’ అని తాను చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని, ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు.
పాలకులం కాదని ఏనాడో చెప్పాను
‘నేనే రాజు.. నేనే మంత్రి’ని మరోలా అర్థం చేసుకున్నారు
ముఖ్యమంత్రినీ నేనే.. మునిసిపల్ మంత్రినీ నేనే..ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత నాదేనని అర్థం
మునిసిపల్ ఎన్నికల ఫలితాలు 90ు మాకే అనుకూలం
పేదలను పరిపాలనలో భాగస్వాములను చేశాం
దళితుడిని అధ్యక్షా అని మైక్ అడిగేలా పైన కూర్చోబెట్టాం
ప్రభుత్వంలో 30 శాతం పదవులు ఎస్సీలకు ఇచ్చాం
నల్లమలలో 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం
వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే నిర్వహిస్తాం
ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంపుసెట్లు మంజూరు
సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని తాను చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని, ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు. తాను పాలకుడిగా ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవ చేయడానికే ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి నేనే.. మునిసిపల్ మంత్రిని నేనే. అందుకే ఎన్నికల్లో గెలుపోటములకు నాదే బాధ్యత అని చెప్పాను. మునిసిపల్ ఎన్నికల్లో 90ు ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చాయి. ఇవి మా పనితీరుకు గీటురాయి. ఈ విషయం కొందరికి అర్థం కాదు. అర్థమైనా స్వీకరించే గొప్ప మనసు వాళ్లకు లేదు. అందుకే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పేదలు పాలించకూడదు.. కేవలం మా పిల్లలే రాజ్యాలు ఏలాలి అన్నది కొందరి విధానం. కానీ, నేను పరిపాలనలో పేదలను భాగస్వాములను చేశాను’’ అని సీఎం రేవంత్ అన్నారు. తనకు అవకాశమిచ్చిన వర్గాలకు సేవ చేయాలన్నదే తన ప్రయత్నమన్నారు. 40 ఏళ్లుగా జటిలంగా మారిన ఎస్సీ వర్గీకరణ సమస్యను తాను పరిష్కరించానని తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే విర్రవీగడం, ఓడిపోతే కుంగిపోవడం తనకు తెలియదన్నారు. 20 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉన్నానని, వచ్చే 20 ఏళ్లు కూడా పేదల కోసమే పనిచేస్తానని ప్రకటించారు.
ఎస్సీలకు 30 శాతం పదవులు..
గతంలో ఒక నాయకుడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారని సీఎం రేవంత్ అన్నారు. కానీ, తాను దళితుడిని ‘అధ్యక్షా’ అని పిలిచి మైక్ అడిగేలా స్పీకర్ హోదాలో పైన కూర్చోబెట్టానని గుర్తు చేశారు. 15శాతం ఉన్న ఎస్సీలకు ప్రభుత్వంలో 30 శాతం పదవులు ఇచ్చామని, నలుగురు మంత్రులు, స్పీకర్ పదవి ఇచ్చి సామాజిక మార్పును తీసుకొచ్చామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనమని, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధమని పేర్కొన్నారు. మిడ్జిల్‌లో తాను జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు తండాల్లోని యువకులు తన విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో లంబాడీ సోదరులు అండగా నిలిచార ని, నేడు సీఎం హోదాలో ఉండడం వెనుక వారి అండదండలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో లంబాడీల పాత్ర ఎనలేనిదని, సురే్‌షనాయక్, కవితా నాయక్ ఆత్మబలిదానాలు చేశారని అన్నారు. లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చిరస్మరణీయ క్షేత్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకోసం అచ్చంపేట అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించినట్లు తెలిపారు. ఏడాదిలోపు దేవాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి వచ్చేసారి జయంతి వేడుకలను అక్కడే నిర్వహిస్తామన్నారు. సంత్ సేవాలాల్ లంబాడీ సమాజాన్ని సన్మార్గంలో నడిపించి అభ్యున్నతి దిశగా తీసుకెళ్లిన మహనీయుడని, ఆయన బోధనలు నైతిక విలువలు, సేవాభావం, సామాజిక ఐక్యతను బలపరిచాయని అన్నారు. గిరిజనులు, తండాల అభివృద్ధి కోసం సీఎం పలు వరాలు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంపుసెట్లు, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు అందనిచోట ట్యాంకులు నిర్మించి సోలార్ పంపుసెట్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు గుర్తుచేశారు. చదువే అన్ని హోదాలను తెస్తుందని, విద్యార్థులు కష్టపడి చదివి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. 100 నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో ఒక్కో చోట 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థులకు స్ఫూర్తి కలగాలనే ఆ వర్గానికి చెందిన అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇచ్చానని, గ్రూప్-1 ఫలితాల్లో 87ు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, సముజ్వల పాల్గొన్నారు.