Share News

ఎన్టీఆర్‌.. ఓ స్ఫూర్తి

ABN , Publish Date - May 29 , 2026 | 03:18 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ స్ఫూర్తి, ఎన్టీఆర్‌ ఆలోచనా విధానం కనిపిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌.. ఓ స్ఫూర్తి

  • మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదర్శం.. యుద్ధ సమయంలో ప్రధాని తలొగ్గడం చూశాం

  • అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్‌ ఇచ్చిన ఇందిర.. ఎన్టీఆర్‌కు కులం, ప్రాంతం, భాష లేదు

  • ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడను.. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్‌

  • ఆయన నీడన బతికి తక్కువ చేసి మాట్లాడొచ్చా?.. ఆయన పేరుతో నకిలీ నేత ఉన్నారు

  • మహిళా రిజర్వేషన్లు రాజీవ్‌, ఎన్టీఆర్‌ల చలువే.. బాబు ప్రణాళికతోనే ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌

  • ఫ్యూచర్‌ సిటీకి దిగ్గజ కంపెనీలను తెస్తాం.. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు, నేతల నివాళులు

  • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడు వేదికగా చంద్రబాబు తీర్మానం

హైదరాబాద్‌ సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ స్ఫూర్తి, ఎన్టీఆర్‌ ఆలోచనా విధానం కనిపిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమం విషయంలో స్ఫూర్తి పొందడంలో తమకు ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్‌ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్‌టీఆర్‌ ఒక శకమని, వారిద్దరి మేలు కలయికే ఈ నాటి కాంగ్రెస్‌ ప్రజాపాలన అని వ్యాఖ్యానించారు. నిరుపేదల అభ్యున్నతిని వారి ఆదర్శంతోనే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గురువారం రేవంత్‌ అమీర్‌పేట మైత్రి వనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ చరిత్రలో ముగ్గురు జాతి రత్నాలను స్మరించుకోవాలని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌, ఉక్కుమహిళ ఇందిరాగాంధీల తర్వాత మూడో వ్యక్తి తెలుగు జాతి గర్వించదగ్గ నేత ఎన్‌టీఆర్‌ అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు సమాన హక్కులు కల్పించింది అంబేడ్కర్‌ అయితే, భూస్వాముల వద్ద లక్షల ఎకరాల భూమిని తీసుకొని నిరుపేదలకు భూములిచ్చి గౌరవాన్ని కల్పించింది ఇందిర అన్నారు. యుద్ధంలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నామని, 1971లో ఇందిర పాకిస్థాన్‌ మీద యుద్ధం గెలిచి బంగ్లాదేశ్‌ను విముక్తం చేశారని చెప్పారు. భారత రాజకీయాలలో వేలు పెట్టొద్దని అమెరికా అధ్యక్షుడినే హెచ్చరించిన ఉక్కు మహిళగా అభివర్ణించారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎన్టీఆరేనన్నారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని వ్యాఖ్యానించారు. మానవ మనుగడ ఉన్నంత కాలం ఆ ముగ్గురి కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయని చెప్పారు.


కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తికి హైదరాబాద్‌ నడిబొడ్డున విగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారని రేవంత్‌ ప్రస్తావించారు. అన్నగారు కులం, మతం, ప్రాంతం, భాషలకు అతీతంగా దేశం గర్వించదగ్గ నేత అన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పాలన అందిస్తున్న తమ ప్రభుత్వం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా భయపడ దలచుకోలేదని చెప్పారు. పీవీ నరసింహరావు, మర్రి చెన్నారెడ్డి, శివశంకర్‌, వెంకటస్వామి లాంటి నేతలను ఇందిరాగాంధీ అందిస్తే, మండవ వెంకటేశ్వర్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, మాధవరెడ్డి, జానారెడ్డి, దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతల్ని ఎన్టీఆర్‌ పరిచయం చేశారన్నారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆరేనని గుర్తు చేశారు. అన్న నీడన బతికిన మీరు వారిని తక్కువ చేసి మాట్లాడడం మంచిదా? అని ప్రశ్నించారు. ఆయన పేరు పెట్టుకుని చలామణి అవుతున్న నకిలీ నాయకుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నామని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్‌టీఆర్‌ ప్రారంభించిన పక్కా ఇళ్ల పథకమే ఇప్పటి ఇందిరమ్మ ఇళ్ల పథకమని, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకమే మెరుగుపరచి సన్న బియ్యం పథకంగా మార్చామని చెప్పారు. ఎన్‌టీఆర్‌ జనతా వస్త్రాల తరహాలోనే ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామని ప్రస్తావించారు. వైఎ్‌సప్రకటించిన రైతులకు ఉచిత కరెంటుకు స్ఫూర్తి ఎన్‌టీఆర్‌ పెట్టిన రూ.50కే హార్స్‌ పవర్‌ అని చెప్పారు. బలహీన వర్గాలు అన్న ఆశీర్వాదంతోనే పాలకులుగా మారారని చెప్పారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థలను రద్దుచేసి తెలంగాణకు విముక్తి కల్పించిన ఘనత ఎన్‌టీఆర్‌ది అన్నారు. తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం స్ఫూర్తితోనే ఇందిరమ్మ దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు భూములు పంచిందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్‌గాంధీ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసిన నాయకుడు ఎన్‌టీఆర్‌ అన్నారు.


స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, శాసనసభ, లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలనే అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్‌ మహిళలకు ఇచ్చేలా ముందుకు వెళ్తామన్నారు. విద్యావంతులైన పాతికేళ్ల యువకులకు ఎన్‌టీఆర్‌ రాజకీయ అవకాశాలు కల్పించారని, తాము కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. మందుల సామేల్‌, వెడ్మ బొజ్జ లాంటి పేదలకు టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేలు చేశామని, క్రీడాకారుడు అజారుద్దీన్‌, బీసీ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న పొన్నం ప్రభాకర్‌ తమ మంత్రివర్గ సహచరులుగా ఉన్నారని ప్రస్తావించారు. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతీ ప్రభుత్వం రెండు సార్లు అధికారానికి వచ్చిందని, 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ప్రకటించారు.

ఫ్యూచర్‌ సిటీకి ప్రపంచాన్నే తీసుకొస్తాం

హైదరాబాద్‌లో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాలను చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారని, అదే తరహాలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తున్నామని, మొత్తం ప్రపంచాన్నే అక్కడకు తీసుకువస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, అజహారుద్దీన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, రఘువీర్‌, ఎమ్మెల్యేలు నవీన్‌ యాదవ్‌, అరెకపూడి గాంధీ, జైవీర్‌, ఇతర నేతలు మండవ వెంకటేశ్వర్‌రావు, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండి రమేష్‌, ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులు రామకృష్ణ, మోహనకృష్ణ, సినీనటుడు మంచు మనోజ్‌ పాల్గొన్నారు.

2.jpg

100 సీట్లలో గెలిచి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

  • పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌

ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ పేదల అభ్యున్నతికి పాటుపడ్డ మహనీయులని.. వారి స్ఫూర్తితోనే సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. అభివృద్ధి నినాదంతో 100 సీట్లతో కాంగ్రెస్‌ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని గురువారం ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే వారిని, కళాకారులను కాంగ్రెస్‌ మరిచిపోదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కోరికను తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముందుంటారని ఇందుకు నిదర్శనం ఎన్‌టీఆర్‌ విగ్రహావిష్కరణే అన్నారు. తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. ఇందిరమ్మ కార్యక్రమాలు, ఎన్టీఆర్‌ సంక్షేమాన్ని జోడించి ప్రభుత్వం ప్రజారంజకంగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆరు నెలల వ్యవధిలోనే నిలబెట్టుకున్నట్టు ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో స్థానికులు ఎన్టీఆర్‌ విగ్రహం కావాలని అడిగారని ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఇది సాధ్యమైందన్నారు.


అన్నగారి గీతాలకు నృత్యాలు

ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా అమీర్‌పేట మైత్రీవనం కూడలిలో గురువారం పండుగ వాతావరణం నెలకొంది. ఆయన అభిమానుల కోలాహలంతో, జై ఎన్టీఆర్‌ నినాదాలతో సందడిగా మారింది. ఎన్టీఆర్‌ సినీ గీతాలకు నృత్యాలు చేస్తూ.. డైలాగ్‌లతో ఏకపాత్రాభినయం చేస్తూ అలరించారు. ఆయన సినిమాల్లో ధరించిన కాస్ట్యూమ్స్‌ వంటి బెల్‌బాటం ప్యాంట్‌, ప్రింటెడ్‌ చొక్కాలు వేసుకొచ్చారు. ఏపీ మల్లాపూర్‌కు చెందిన వి.రాము ఎన్టీఆర్‌ వస్త్రధారణతో రావడంతో పలువురు ఆయనతో ఫొటోలు దిగారు. అన్నగారికి తాను అభిమానినని ఆయన తన ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని తనకు ప్రభుత్వ పదవి ఇచ్చారని రాము గుర్తుచేసుకున్నారు. కాగా సీఎం రేవంత్‌ రాక ఆలస్యం కావడంతో అమీర్‌పేట ఎలిఫెంట్‌ హౌస్‌ వరకు జనం రద్దీ పెరిగిపోయింది. ఆవిష్కరణకు ముందే విగ్రహం వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సాయంత్రం 6.30కు రావాల్సిన సీఎం 7.20 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు ఎన్టీఆర్‌ అభిమానులు పోటీ పడ్డారు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ సీఎం వారితో ఫొటోలు దిగి కాసేపు ముచ్చటించారు.

Updated Date - May 29 , 2026 | 03:18 AM