ప్రాణహితపై చర్చిద్దాం.. లేదంటే ఉప్పెనే!
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:43 AM
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీపై చర్చించుకుందామంటూ లేఖ రాస్తే మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ స్పందించడం లేదని, ఆయన సమయం....
ఏడాదిగా సమయం కోరుతున్నా ఫడణవీస్ ఇవ్వడం లేదు
అవమానాన్ని తెలంగాణ సహించదు
రైతులు, తండాలు, గూడేలు ఉప్పెనై కదుల్తాయ్
అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దూతగా వ్యవహరించాలి
లేదంటే ఆయనను తెలంగాణలో తిరగనివ్వరు
పోలవరం కోసం ఏపీకి మా 7 మండలాలు, లక్షలాది మంది ప్రజలను మోదీ అప్పగించారు
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర నుంచి 2 వేల ఎకరాలు అప్పగించలేరా?
రాష్ట్రంలో కొత్తగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
గూడేల్లో గుడిసెలు లేకుండా అందరికీ ఇళ్లు
కాగజ్‌నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, రెబ్బెన, ఆసిఫాబాద్, కెరమెరి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీపై చర్చించుకుందామంటూ లేఖ రాస్తే మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ స్పందించడం లేదని, ఆయన సమయం ఇవ్వకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఉప్పెనగా మారుతుందని, అది మహారాష్ట్రకే సమస్యగా తయారవుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దూతగా వ్యవహరించాలని, మహారాష్ట్ర సీఎం వద్దకు తనను తీసుకెళ్లాలని లేకపోతే కిషన్‌రెడ్డిని తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని చెప్పారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కొత్తగూడ కొఠారిలో సోమవారం రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్తగా మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ప్రకటించిన 4.50లక్షల ఇళ్లలో 1.20 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయని, సెప్టెంబరు 17నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధం చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి లేమిపై సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఆదిలాబాద్ జిల్లా అనగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గుర్తుకొస్తది. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ఈ ప్రాజెక్టును గత పాలకులు పడావు పెట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్దకు ప్రాజెక్టును తీసుకెళ్లి, రూ.లక్ష కోట్లను ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కూళేశ్వరం కావడం, లక్ష కోట్లు గంగలో కలిసిపోవడం జరిగింది.
ఆదిలాబాద్‌లో ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. ఇంతకుముందే కుమ్రం భీం ప్రాజెక్టును చూశా. 10 టీఎంసీల ప్రాజెక్టుకు రిపేర్లు చేయకపోవడం వల్ల కేవలం 4 టీఎంసీల నీటిని మాత్రమే నిలుపుకొనే పరిస్థితి ఉంది. జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాజెక్టులు పడావు పడ్డాయి. అందుకే ఆదిలాబాద్ జిల్లాను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నాం. ఆనాడు వైఎస్సార్ మొదలుపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించాం. మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశాం. ఆయన ఇంతవరకు స్పందించలేదు. అంతరాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశానికి సమయం ఇవ్వాలంటూ మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను ఏడాదిగా కోరుతున్నా. అయినా స్పందన లేదు. మీరు సమయం ఇవ్వకపోతే... ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనై కదులుతుంది’ అని హెచ్చరించారు. ఫడణవీస్! గుర్తు పెట్టుకోండి.. తెలంగాణను నిర్లక్ష్యం చేస్తే, అవమానిస్తే ఊరుకోదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముందుకురావాలన్నారు. ‘మహారాష్ట్ర సీఎం కనీస గౌరవాన్ని పాటించడం లేదు. నేను నీకు నచ్చకపోవచ్చు. నీ చీకటి మిత్రుడు కేసీఆర్‌కు నచ్చకపోవచ్చు. కానీ ఈ సమస్య లక్షలాది తెలంగాణ రైతులది. దీని పరిష్కారానికి కిషన్‌రెడ్డి దూతగా వ్యవహరించాలి. మీరు మహారాష్ట్ర సీఎం వద్దకు నన్ను తీసుకెళ్లండి. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే... 1500 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టుకు ఆటంకమవుతున్నాయంటే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను, లక్షలాది తెలంగాణ బిడ్డలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పింది మీరు కాదా అని ప్రధాని మోదీని రేవంత్ ప్రశ్నించారు.
‘ఈనాడు తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి 2 వేల ఎకరాలను ఇప్పించలేరా నరేంద్రమోదీ? మేముఊళ్లను, మనుషులను అడగటం లేదు. అక్కడ ముంపునకు గురయ్యే భూములను అడుగుతున్నాం. ఎంత ఖర్చయినా ఇస్తాం. ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి, కిషన్‌రెడ్డి పరిష్కరించలేరా? తెలంగాణ సీఎం అంటే ఇంత చిన్న చూపా? పంచాయితీ కావాలా పరిష్కారం కావాలాఅని అంటే... నేను పరిష్కారం కోరుకుంటా. సమస్య పరిష్కారం కానట్లయితే... పంచాయితీ ద్వారా పరిష్కరించుకోవడానికి నేను సిద్ధం. ఇందులో మహారాష్ట్ర సీఎం ఉన్నాడా, కిషన్‌రెడ్డి ఉన్నాడా అనేది చూడను. నాకు ప్రజలు, రైతుల సమస్యలే ముఖ్యం’ అని అన్నారు.
ఆదివాసీ బిడ్డల సొంత ఇంటి కల
60-70 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లాకు జరిగిన అన్యాయాలను పరిష్కరించాలంటే ఆషామాషీ కాదని, ఈ ప్రయత్నంలో జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కరించుకుంటూ వారిని తోడుగా తీసుకెళ్తున్నామని రేవంత్ చెప్పారు. ‘ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డలు మణులు, మాణిక్యాలు అడగలేదు. వైజ్రాలు, వైఢూర్యాలు అడగలేదు. ఆత్మగౌరవంతో బతకడానికి గూడెంలో సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నారు. వారి కలను సాకారం చేయకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనట్లేనని ఆలోచించి, ప్రతి నియోజకవర్గానికి 3,500ఇందిరమ్మ ఇళ్ల చొప్పున 4.50లక్షల ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’అని వెల్లడించారు. నాగోబా జాతరకు ఆహ్వానించడానికి తన వద్దకు ఆదివాసీ పెద్దలు వచ్చినప్పుడు... గూడేలు, ఐటీడీఏల పరిధిలో 21 వేల ఇళ్లను అదనంగా మంజూరు చేయాలని అధికారులకు చెప్పానన్నారు. కొఠారికి వెళ్లినప్పుడు కొలాం సోదరులు కొంత మందికి ఇంకా ఇళ్లు రాలేదని చెప్పారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోని గూడేలు, తండాలలో ఉండేవారికి నూటికి నూరు శాతం ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ‘పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలకు సూచన చేస్తున్నా. ఏడాదిలోపు ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. తల తాకట్టు పెట్టయినా నిధులు తీసుకు వచ్చే బాధ్యత నాది. గతంలో ఇచ్చిన 4.50 లక్షల ఇళ్లలో 1.20 లక్షల ఇళ్లను 13 నెలల్లో పూర్తి చేసుకున్నామని, సెప్టెంబరు 17వ తేదీ నాటికి మరో లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు చేయడానికి సంపూర్ణ ఏర్పాట్లు చేస్తామన్నారు. గిరిజన గూడెం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
కొత్తగా మరో 2.5 లక్షల ఇళ్లు
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, అందుకనే మరో రెండున్నర లక్షల ఇళ్లను కొత్తగా మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. గతంలో పనులు మొదలు పెట్టి, కాస్తో కూస్తో బిల్లులు వచ్చిన ఇళ్ల స్థానంలో వీటిని ఇస్తామన్నారు. ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు, గృహ లక్ష్మి పథకం కింద కాగితం ఉన్నవారిని ఈ ఇళ్లలో భాగస్వాములు చేస్తామని తెలిపారు. ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మరో 10-15 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయన్న అంచనాలున్నాయని, ఆ ధాన్యాన్ని కూడా ఈ నెల 15 లోపు సేకరిస్తామని స్పష్టం చేశారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఎన్నిసార్లు కోరుతున్నా... పంజాబ్, హరియాణా వంటి ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం సేకరించిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడును కేంద్రంతో కొనిపించే బాధ్యత కిషన్‌రెడ్డి తీసుకోవాలని చెప్పారు. జూన్ 15 తర్వాత కూడా కొనకపోతే కిషన్‌రెడ్డి ఇంటి వద్ద, బీజేపీ కార్యాలయం వద్ద వాటిని పోస్తామని హెచ్చరించారు. ‘రైతులు అధైర్యపడొద్దు. ప్రతి గింజనూ కొంటాం. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం’ అని సీఎం హామీ ఇచ్చారు. అంతకు ముందు కొలాం కొఠారి గ్రామపంచాయతీ కొత్తగూడ గ్రామంలోని సిడాం కన్నీబాయి, టేకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వారి కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట స్వామి, సీతక్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.