ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు రండి
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:52 AM
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7 నుంచి నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. మంగళవారం తాజ్ ఫలక్‌నుమా ప్యాలె్‌సలో ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు
ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానం
ఆగాఖాన్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసలు
సిటీ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రిని పునరుద్ధరించాలని వినతి
ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు సీఎం రేవంత్ ఆహ్వానం.. ఆగాఖాన్ ఫౌండేషన్ కార్యక్రమాలపై ప్రశంసలు
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7 నుంచి నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. మంగళవారం తాజ్ ఫలక్‌నుమా ప్యాలె్‌సలో ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5 తండ్రి ఆగాఖాన్-4 మృతి పట్ల సీఎం సంతాపం తెలిపారు. హైదరాబాద్‌తో ఆగాఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆగాఖాన్ ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందని సీఎం తెలిపారు. తెలంగాణలో ఫౌండేషన్ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఆగాఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకుని ఇటీవలే ప్రారంభించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో పునరుద్ధరించిన కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రారంభోత్సవంలో తాము కలిసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
మూసీ పునరుజ్జీవంపై ప్రత్యేక దృష్టి
మూసీ పునరుజ్జీవంపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈసీ, మూసీ నదుల సంగమ ప్రదేశం ఆక్రమణలకు గురికావడంతో పాటు కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆస్పత్రి భవనాల పునరుద్ధరణలో ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని సీఎం కోరారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పగా.. దీనిపై ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5 ఆసక్తి కనబరిచారు. ఫ్యూచర్ సిటీని ఎక్కడ నిర్మిస్తున్నారని ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 2.5 శాతం ఉందని, దానిని 10శాతానికి పెంచుతామని అన్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 7 నుంచి మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
విద్య, పర్యాటక రంగాల్లో సహకారంపై చర్చ
ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో వివిధ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు రామకృష్ణారావు.. ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌సతోపాటు ఇతర యూనివర్సిటీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకరించాయన్నారు. ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా కోరారు. పర్యాటక రంగంలో ఆగాఖాన్ ఫౌండేషన్ పాత్రను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు