Share News

బీజేపీ హామీలను నమ్ముతామా?

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:44 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అవి నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...

బీజేపీ హామీలను నమ్ముతామా?

  • పాలమూరు-రంగారెడ్డికి మోదీ జాతీయ హోదా ఇచ్చారా?

  • బండి పోతే బండి ఇస్తానన్న సంజయ్‌ మాట మార్చలేదా?

  • రాష్ట్రం నుంచి రూపాయు తీసుకుని.. 42 పైసలు ఇస్తున్నారు

  • దీనిపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఏనాడైనా మాట్లాడారా?

  • ఒవైసీని భూతంగా చూపి ఇంకెంతకాలం ఓట్లడుగుతారు?

  • గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం?.. మోరీ పాడైతే మోదీ వచ్చి తీస్తారా?.. బీఆర్‌ఎ్‌సకు ఓట్లడిగే హక్కే లేదు

  • మునిసిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది

  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • జిల్లాల పునర్విభజన 2027 మార్చి దాకా ఉండదని వ్యాఖ్య

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అవి నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ.. తెలంగాణకు అదనంగా ఏదైనా పాజ్రెక్టును ఇచ్చారా? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్‌కు వచ్చిన మోదీ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి జిల్లాలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తానని హామీ ఇచ్చారని, కానీ.. ఆ తరువాత మూడుసార్లు ప్రధాని అయినా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారా? అని నిలదీశారు. ఇటీవల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. గతంలో మోదీ ఇచ్చిన హామీని ప్రస్తావించకుండా.. మోదీని చూసి ఓటేయమన్నారని ఎద్దేవా చేశారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌.. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి సహకారంపై మాట్లాడకుండా ఆ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలకు నష్టపరిహారంపై మాట్లాడారని విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా బండి పోతే బండి.. కారు పోతే కారు ఇస్తామంటూ బండి సంజయ్‌ హామీలు ఇచ్చారని, కానీ, ఎన్నికల తర్వాత వరదల్లో కొట్టికుపోయిన బండికి, కారుకు ఇన్సూరెన్సు ఉంటుంది కదా! అని మాట్లాడారని తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోరు జరగబోతోందని చెప్పారు. 12 ఏళ్ల బీజేపీ పాలన, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో తమ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి మునిసిపాలిటీ అభివృద్ధికీ కాంప్రిహెన్సివ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తామని, మునిసిపల్‌ శాఖ మంత్రిగా తానే దీనిని పర్యవేక్షిస్తానని తెలిపారు.


దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల మంజూరులో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో తీసుకుంటున్న ప్రతి రూపాయిలో 42 పైసలు మాత్రమే నిధుల రూపంలో ఇస్తోందని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు రూపాయికిగాను వరుసగా 16, 26, 49 పైసల చొప్పున పన్నుల్లో వాటాగా ఇస్తోందన్నారు. కానీ, ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్‌కు రూపాయికి రూ.6.06, మధ్యప్రదేశ్‌కు రూ.2.09, ఉత్తరప్రదేశ్‌కు రూ.2.03 చొప్పున ఇస్తోందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల ఈ వివక్షను సరిదిద్దాల్సిందిగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఏనాడైనా వారి ప్రభుత్వాన్ని కోరారా? అని ప్రశ్నించారు. పైగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టినట్లుగా మాట్లాడటం ఎంతవరకు న్యాయమన్నారు. ‘‘మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న ప్రతి కేంద్ర మంత్రీ రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. ప్రహ్లాద్‌ జోషి అయితే రూ.20 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఇది సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్‌లాగా ఉంది. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయిలోనూ రాష్ట్రం వాటా ఆటోమోడ్‌లో వచ్చేస్తుంది. దానికి కేంద్రం రికమెండేషన్‌ అవసరం లేదు. పన్నుల వాటాకు అదనంగా రాష్ట్రానికి కేంద్ర ఏం ఇచ్చిందో చెప్పాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రాలను శిక్షిస్తారా?

‘వెనుకబాటు, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇస్తున్నట్లు చెబుతున్నారని, కానీ.. జనాభా, అభివృద్ధి విషయంలో క్రమశిక్షణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్‌ ప్రాజెక్టును మోదీ ఒత్తిడి చేసి ఏపీకి తరలించారని ఆక్షేపించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కనీసం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకైనా నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు. మోదీని చూసి ఓటు వేయాలంటున్న వారు.. గల్లీ ఎన్నికలకు, మోదీకి సంబంధమేంటో చెప్పాలని అన్నారు. గల్లీలో మోరీ పాడైతే మోదీ వచ్చి తీస్తారా? అని ప్రశ్నించారు. గల్లీ సమస్యలను ఎవరు తీర్చుగలరో ఓటర్లు ఆలోచన చేయాలన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీని భూతంగా చూపించి ఎంతకాలం ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. రాజకీయ మనుగడ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ భావదారిద్ర్యానికి నిదర్శనమన్నారు.


బీఆర్‌ఎస్‌ పార్టీని యాసిడ్‌తో కడగాలి

మునిసిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు అడిగే హక్కు కూడా లేదని సీఎం రేవంత్‌ అన్నారు. అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ వారే కౌన్సిలర్లు, చైర్మన్లుగా ఉన్నారని, సీఎం, మంత్రులూ వారేనని గుర్తు చేశారు. పదేళ్లుగా వారు పరిష్కరించని సమస్యలను.. ఇప్పుడు పరిష్కరిస్తామని, ఓటేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అహంకారంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, ఇవి పెద్ద చదువులు చదివామంటున్నవారు మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు. 2014 నుంచి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలది విడదీయలేని బంధమని సీఎం రేవంత్‌ ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్‌ తలాక్‌ చట్టం, జీఎస్టీ తదితర చట్టాలకు బీజేపీకి లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని, పెద్ద నోట్ల రద్దును కేసీఆర్‌ అసెంబ్లీ పెట్టి అభినందించారని గుర్తు చేశారు. అయితే ఈ బంధాన్ని.. పేగు బంధమైన తెలంగాణకు నిధులు తీసుకురావడంలో కేసీఆర్‌ ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. ఈ క్విడ్‌ ప్రోకోను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎ్‌సను యాసిడ్‌ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ పోదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని రేవంత్‌ అన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో వార్డులు/డివిజన్లలో బీసీలకు పార్టీ పరంగా 61 శాతం సీట్లు ఇచ్చామని, ఇది బీసీల పట్ల తమ కమిట్‌మెంట్‌ అని చెప్పారు. బీఆర్‌ఎస్‌ .. బీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి మునిసిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చిందని, బీసీల విషయంలో ఏ పార్టీ రంగు ఏంటన్నది దీంతో బయటపడిందని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మోదీని కలిసి అడుగుతామని, అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతామని స్పష్టం చేశారు.


పునర్విభజన కుదరదు: సీఎం

కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యం కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జనగణన చేపట్టిన సందర్భంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఏ హద్దులూ మార్చడానికి వీల్లేదంటూ అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఆదేశించిందన్నారు. సోమవారం మీడియాతో సీఎం చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. జనగణన తర్వాత నియోజకవర్గ పునర్విభజన, నియోజకవర్గాల పెంపు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌, జమిలి ఎన్నికలు ఉంటాయని చెప్పారు. జమిలి ఎన్నికలు 2029లో జరుగుతాయన్నారు. నియోజకవర్గాల పెంపు ప్రోరేటా ప్రకారం జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టమేనన్నారు. వివిధ రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్యలో వ్యత్యాసం ప్రస్తుతం ఎలా ఉందో.. పునర్విభజన, పెంపు తర్వాతా అలాగే ఉండాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావును బీఆర్‌ఎస్‌ వాళ్లు 20 నెలలపాటు అమెరికాలో దాచిపెట్టడం వల్లనే కేసు ముందుకు పోలేదని తెలిపారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయనను తీసుకురాగలిగామని, ఆ తర్వాతే కేసులో పురోగతి వచ్చిందని అన్నారు. అయితే జైలుకు వెళ్లినవారు సీఎంలు అవుతున్నారంటూ కేటీఆర్‌, హరీశ్‌రావు జైలుకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు.

రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తాననలేదు..

రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని తాను చెప్పలేదని సీఎం రేవంత్‌ అన్నారు. మునిసిపల్‌ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిగా.. స్థానిక మునిసిపాలిటీ బాధ్యతను రంజిత్‌రెడ్డికి ఇస్తానన్నానని స్పష్టత ఇచ్చారు. కవిత అంశం వారి కుటుంబానికి సంబంధించినదని, వారంతా కలిసి ఉన్నప్పుడే కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ఓడించి సీఎం సీట్లోకి వచ్చిన తనకు.. వారి కుటుంబ కొట్లాటను వాడుకోవాల్సిన అగత్యం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కిషన్‌రెడ్డిని పట్టుకుని ‘రండ’ అని కేసీఆర్‌ అన్నప్పుడు బీఆర్‌ఎస్‌ వారికి భాష గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. అధికారం తమ తాతల జాగీరు, జన్మహక్కు అంటే కుదరదని, వందల ఏళ్లు పాలించిన రాజులు కూడా పోయారని రేవంత్‌ అన్నారు. ప్రకృతి హెచ్చరించినప్పుడు సరిదిద్దుకోకుంటే ప్రకృతే సవరిస్తుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కేసును సీబీఐ తిరస్కరిస్తే విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ విజయా డెయిరీ నెయ్యినే వాడుతున్నట్లు చెప్పారు. దేశంలోని ఏ పార్టీకైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందని, ఎవరికి ఓటేయాలన్నది ప్రజల ఇష్టమని అన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 06:11 AM