Share News

పెంపులేని పునర్విభజనకు ఓకే

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:19 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపట్టినా, ప్రోరేటా పద్ధతిలో చేసినా.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి..

పెంపులేని పునర్విభజనకు ఓకే

  • సీట్లు పెంచకుండా చేపడితే మద్దతిస్తాం.. లేదంటే హైబ్రిడ్‌ మోడల్‌ను పరిశీలించాలి

  • ప్రోరేటాకు దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకోవు

  • ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయించాలి

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ లేఖ

  • ప్రోరేటాను వ్యతిరేకిద్దాం.. హైబ్రిడ్‌ను కోరదాం

  • ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు రేవంత్‌ లేఖలు

  • నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి

  • ఎంపీగా వేం నరేందర్‌రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపట్టినా, ప్రోరేటా పద్ధతిలో చేసినా.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పద్ధతుల్లో డీలిమిటేషన్‌కు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవన్నారు. లోక్‌సభ సీట్ల పెంపు లేకుండా పునర్విభజనకైతే సంపూర్ణ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డీలిమిటేషన్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాగే చేయవచ్చన్నారు. లేని పక్షంలో తాను ప్రతిపాదించిన హైబ్రీడ్‌ మోడల్‌ను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. అన్ని రాష్ర్టాలు, రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్‌, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి.. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను అమలు చేయాలని, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని తెలిపారు.


ఆ ప్రతిపాదనే వివాదాస్పదం..

లోక్‌సభ సీట్లను 850కి పెంచే ప్రతిపాదనే వివాదాస్పద అంశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి.. వాటిని ప్రోరేటా పద్థతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా లేదా ప్రోరేటా పద్ధతిలో లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ర్టాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలు అంగీకరించబోవని తెలిపారు. 1970ల నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ర్టాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందన్నారు. జనాభాలో తేడాల వల్ల జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి.. ఇందిరాగాంధీ, వాజపేయి వంటి నాయకులు ఈ అంశాన్ని వాయిదా వేశారని గుర్తు చేశారు. ఆర్థిక సహకారం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రోరేటా పద్ధతిలో సీట్ల పెంపు చేపడితే.. దేశ సమాఖ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిధ్యం దేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. సీట్ల పెంపుతో దక్షిణ రాష్ర్టాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి, కేరళ రాష్ర్టాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ర్టాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ప్రోరేటాతో రాజకీయ అసమతుల్యత..

ప్రోరేటా విధానం కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందని సీఎం రేవంత్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉందన్నారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదహరించారు. ఇది దక్షిణాది-ఉత్తరాది అసమానతకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ర్టాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో వారి ప్రాధాన్యం తగ్గిపోతోందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది-మధ్య ప్రాంత రాష్ర్టాలు లాభపడతాయని తెలిపారు. అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ర్టాలకు శిక్ష పడుతుందని, జనాభా పెరిగిన రాష్ర్టాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని వివరించారు. దక్షిణ రాష్ర్టాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరిస్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయన్నారు. ఈ కృషిని పట్టించుకోకుంటే.. దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అందరికీ న్యాయం జరిగేలా స్థిరమైన పరిష్కారం అవసరమన్నారు.


హైబ్రిడ్‌ మోడల్‌ ఓ ప్రత్యామ్నాయం..

తాను ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ర్టాల సహకారాన్ని ఈ మోడల్‌ సమతుల్యం చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు సూచించిన రిజర్వేషన్లకు 50 శాతం, మెరిట్‌కు 50 శాతం విధానాన్ని లేఖలో ప్రస్తావించారు. హైబ్రీడ్‌ మోడల్‌ ప్రకారం.. కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రోరేటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ర్టాల ఆర్థిక భాగస్వామ్యం (జీఎస్‌డీపీ), అభివృద్థి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. దీంతో అభివృద్ధి చెందిన రాష్ర్టాలు నష్టపోకుండా ఉండటంతో పాటు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ర్టాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. మరోవైపు లోక్‌సభ సీట్లను ప్రోరేటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన తమకు నష్టం చేస్తుందని, దీనిని వ్యతిరేకిద్దామని దక్షిణాది రాష్ర్టాలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు మంగళవారం లేఖలు రాశారు. అన్ని రాష్ర్టాలకు న్యాయం జరిగేలా హైబ్రీడ్‌ మోడల్‌ను పరిశీలించాలని కోరేందుకు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.’

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతోపాటు.. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి కూడా వెళుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కేఆర్‌ సురేష్‌ రెడ్డి పదవీకాలం ఈ నెల 9న ముగిసింది. ఆ స్థానంలో ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వీక్షించనున్నారు. అలాగే కీలకమైన లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంటు ముందుకు వస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల వాదన వినిపించేందుకు వీలుగానూ సీఎం ఢిల్లీకి వెళుతున్నారు. ఏఐసీసీ నిర్వహించనున్న ముఖ్య సమావేశాలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా రేవంత్‌రెడ్డి చేయనున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 04:19 AM