ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా లంబాడా
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:48 AM
ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిపి ఉందని, దానిని వేరు చేసి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, లంబాడ సోదరులనే దానికి చైర్మన్‌గా నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రాజకీయాల్లో వారికి రావాల్సిన వాటా సాధిస్తాం
నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగు సభలో సీఎం
ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధి, సేవాలాల్ ఆలయానికి శంకుస్థాపన
మహబూబ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిపి ఉందని, దానిని వేరు చేసి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, లంబాడ సోదరులనే దానికి చైర్మన్‌గా నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజకీయాల్లో లంబాడాలకు రావాల్సిన వాటాను సాధిస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగులో రూ.71 కోట్లతో పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి పనులు, హరిత హోటల్, సంత్ సేవాలాల్ విగ్రహం, ఆలయ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిజనులతో ప్రత్యేకంగా నిర్వహించిన సభలో సీఎం పాల్గొని.. ‘గోర్ బాయ్ బహెన్ రామ్ రామ్’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘దేశంలో ఓచోట లంబాడీలు, మరోచోట లంబాడాలు, ఇంకోచోట సుగాలీలు.. ఏ పేరుతో పిలిచినా సేవాలాల్ చూపిన సన్మార్గంలో నడుస్తూ నమ్మిన వారికి సొమ్ము అవుతున్న జాతి లంబాడీలు.
గతంలో అన్ని పార్టీలు లంబాడీలను ఓట్లు వేసే యంత్రాలుగా, అధికారంలోకి తెచ్చే పాత్రధారులుగా మాత్రమే చూశారు. కానీ, ఆ జాతిలో ఉన్న పేదరికాన్ని, చైతన్యాన్ని, పోరాట పటిమను చూసి, వారికి సమాన అవకాశాలు ఉండాలని ఇందిరా గాంధీతో జైపాల్ రెడ్డి చెబితే.. బలహీన వర్గాల్లో ఉన్న వారిని గిరిజనుల్లో కలిపి ఇందిరా గాంధీ వారికి ఎస్టీ హోదా కల్పించారు. ఆ హోదాతోనే నేడు దేశం గర్వించే డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. భూమి లేని నిరుపేదలైన లంబాడీలకు అసైన్డ్ భూములు, అటవీ భూములు దున్నుకుంటే పట్టాలు కూడా ఇందిరా గాంధీ ఇచ్చారు. ఇప్పటికీ ఏ తండాకు వెళ్లినా సంత్ సేవాలాల్ ఫొటో పక్కన ఇందిరమ్మ ఫొటో ఉండటం ఆమె పట్ల లంబాడీలకు ఉన్న గౌరవానికి నిదర్శనం’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారు తమ ఇళ్లల్లో పిల్లలకు నాడు ఇందిరమ్మ పేరు, నేడు ప్రియాంకమ్మ పేరు పెట్టుకుంటుండటం ఆనందంగా ఉందన్నారు. నల్లమల పేరు వింటే ఈ ప్రాంత బిడ్డగా తాను ఉద్విగ్నతకు లోనవుతానని, పోరాటతత్వం, మాట నిలబెట్టుకునే తత్వం ఇక్కడి నుంచే తనకు వచ్చాయని చెప్పారు. సంత్ సేవాలాల్ ఆలయం అక్కడ నిర్మించాలని వరంగల్ మిత్రులు కోరితే, అక్కడ రెండో ఆలయం నిర్మించుకుందామని, నల్లమలలోనే మొదటి ఆలయం నిర్మించాలని తాను పట్టుబట్టానని తెలిపారు. ఆలయానికి ఇప్పుడున్న 16 ఎకరాలకు తోడు మరో 4 ఎకరాలు కూడా సేకరించాలని సూచించారు. లంబాడీల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు?
రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్