నా శక్తి ఆడబిడ్డలే
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:48 AM
ఆడబిడ్డల ఆశీర్వాదమే తనకు శక్తి అని, వారి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా
బీఆర్‌ఎస్‌ను మహిళలు ప్రశ్నించాలి.. వాత పెట్టాలి
కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్
కొడంగల్‌లో పుట్టినరోజు వేడుకలు
వికారాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/దుద్యాల: ఆడబిడ్డల ఆశీర్వాదమే తనకు శక్తి అని, వారి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం- మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు కొత్తగా మంజూరు చేసిన 4.50 లక్షల పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మహిళలు కేవలం సంఘాల సభ్యులుగా కాకుండా వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టినట్టేనన్నారు. ‘‘మహిళా శక్తే.. నా శక్తి. అందుకే మీ అందరి మధ్య నా పుట్టినరోజు నిర్వహించుకోవాలని ఇక్కడకు వచ్చాను. ఆడ బిడ్డల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా. నా పుట్టినరోజును మహిళా శక్తికి అంకితం చేస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఆడబిడ్డ నిలబడితే కుటుంబం బాగుపడుతుంది
ఆడబిడ్డ నిలబడితే కుటుంబం నిలబడుతుందని, అందుకే ప్రతీ ప్రభుత్వంపథకాన్ని మహిళల పేరుతోనే అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని కోటి మంది ఆడబిడ్డలకు సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ‘‘ఆడబిడ్డలను ఉన్నత చదువులు చదివించ ండి. ఆడపిల్లకు వెంటనే పెళ్లి చేయవద్దు. బాగా చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడితే ఇంటికి క్యూ కట్టి.. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 2,842 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.306 కోట్లు చెక్కు, కొడంగల్ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్, ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరు పత్రం, కోస్గి, గుండుమల్ మండల సమాఖ్యలకు సోలార్ పవర్ యూనిట్ల స్థాపన కోసం రూ.2.07 కోట్ల చెక్కు, జిల్లాలో 2001 మంది కొత్త పింఛన్‌దారులకు పెన్షన్ మంజూరు పత్రాలు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, స్పీకర్ ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత వేదిక పైనుంచి కిందకు వచ్చి మహిళలను కలిశారు. ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు మహిళలు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
చెల్లిని గెంటేసిన దుర్మార్గుడు..
కేటీఆర్ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసిన దుర్మార్గుడని సీఎం రేవంత్ అన్నారు. అలాంటి వ్యక్తి మహిళలను ఉద్దరిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘చింపిరి గడ్డమేసుకుని ఊరూరు తిరుగుతున్నాడు. సొంత చెల్లెలే ఆయనను దగుల్బాజీ అంటోంది. చెల్లి ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవాడే అన్న. కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని బయటకు పంపించేశాడు. రాఖీ పండగ రోజు ఇక్కడ ఉంటే రాఖీ కడుతుందోమోనని విదేశాలకు వెళ్లాడు. మంచీ చెడు చెప్పాల్సిన తండ్రి ఫాంహౌస్‌లో పడుకున్నాడు’’ అని సీఎం విమర్శించారు. పదేళ్లు అధికారం ఇస్తే ఏమిచ్చారో అడగండని సూచించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. కళ్లలో నిప్పులు పోసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లతో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారు వచ్చినప్పుడు నిలదీయాలని, రొట్టెలు కాల్చే కడ్డీని ఎర్రగా కాల్చి.. వాత పెట్టాలని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో రూ.6.06 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ఆదివారం విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. మ్యూజియంలో వివిధ గ్యాలరీలను సందర్శించారు.
కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు
ఆదివారం దీపావళి పండుగ, సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొడంగల్‌లోని ఆయన స్వగృహంలో సతీమణి గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి, మనుమడు, అల్లుడు రేవంత్‌రెడ్డితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఇతర నేతలు సీఎంకు ఫొటో బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులు సుమిత్ర-శ్రీనివాస్ దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. లబ్ధిదారు ఇంట్లో మంత్రులు, ఇతరు నేతలతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి 4 లక్షల మంది.. ప్రధాని మోదీకీ ఆహ్వానం!
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో యూపీ పట్టణం లోనీ