బ్యాగు బ్రాండెడ్.. బియ్యం రేషన్
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:33 AM
ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం.. మార్కెట్‌లో బ్రాండెడ్ సన్న బియ్యంగా మారుతున్నాయి
కర్మన్‌ఘాట్ పరిసరాల్లో అమ్మకాలు
పలు దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
బస్తాల తూకంలోనూ తేడాలు గుర్తింపు
ఆరుగురు వ్యాపారులపై క్రిమినల్ కేసులు
హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి అర్బన్, ఎల్బీనగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం.. మార్కెట్‌లో బ్రాండెడ్ సన్న బియ్యంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో బ్రాండెడ్ బియ్యం పేరుతో రేషన్ బియ్యాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నట్లు బయటపడింది. లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి, మిల్లులకు తరలించి, పాలిష్ చేసి బ్రాండెడ్ సన్న బియ్యం తరహాలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని ఆరోపణలు రావటంతో గురువారం పలు దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని కొన్ని రైస్ మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలించి పాలిష్ చేసి అధిక ధరలకు బ్రాండెడ్ బియ్యంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కర్మన్‌ఘాట్‌లోని సుమారు 40 నుంచి 50 హోల్‌సేల్ బియ్యం దుకాణాల్లో ఈ తరహా బియ్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు పలు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో సివిల్ సప్లై, విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు.
26 కిలోల బియ్యం బస్తాను తూకం వేయగా అందులో 24 కిలోలే ఉండటాన్ని గుర్తించారు. కొందరు వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు లేకుండా, ప్రముఖ బ్రాండ్ల పేరుతో బియ్యం విక్రయిస్తున్నట్లు తేలింది. ఇకపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని సివిల్ సప్లై విజిలెన్స్ ఎస్పీ శశిధర్‌రాజు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఆరుగురు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అధికారులు తనిఖీలకు రావడం చూసి కొంతమంది వ్యాపారులు దుకాణాలు మూసివేసి పరారైనట్లు సమాచారం. రేషన్‌బియ్యం స్మగ్లింగ్ చేసేవారిపై బైండోవర్ కేసులు బుక్ చేస్తున్నామని, బియ్యాన్ని నల్ల బజారుకుతరలిస్తే చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పరిమితికి మించి బియ్యం నిల్వ చేస్తే కేసులు పెడతామన్నారు. తూకంలో అక్రమాలకు పాల్పడేవారి ట్రేడ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు