Share News

షాబాద్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్‌ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:02 PM

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు.

షాబాద్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్‌ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..
NHRC

రంగారెడ్డి: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.


గతంలో బాధితురాలి తండ్రి అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ రమేశ్ తగిన విధంగా స్పందించి, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని న్యాయవాది ఆరోపించారు. ఆ నిర్లక్ష్యమే అనంతరం జరిగిన ఆరు హత్యలకు కారణమైందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, పోక్సో బాధితురాలితో సహా ఆరుగురు ప్రాణాలు తీసిన ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రామారావు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ వేగవంతం చేసి ఆ సైకో కిల్లర్‌కు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు.


బాధితురాలి కుటుంబంలో మిగిలిన సభ్యులకు తక్షణమే భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని పిటిషన్‌లో విన్నవించారు. అయితే, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ ఫిర్యాదుపై ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, షాబాద్ ఘటనలో ఇప్పటికే ఎస్‌ఐ రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

షాబాద్ SI రమేష్‌ సస్పెన్షన్

సెమీకండక్టర్ రంగంలో మరో మైలురాయికి చేరిన తెలంగాణ..

Updated Date - Jul 11 , 2026 | 04:13 PM