షాబాద్ SI రమేష్ సస్పెన్షన్
ABN , Publish Date - Jul 11 , 2026 | 02:08 PM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో షాబాద్ ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేయగా, మరోవైపు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ప్రయాణించిన కారును పోలీసులు నందిగామ సమీపంలో గుర్తించారు.
రంగారెడ్డి: ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రమేష్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యతో బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు చేపట్టిన ఆందోళనను విరమించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అతడు ప్రయాణించిన కారును నందిగామ సమీపంలో పోలీసులు గుర్తించారు. కారు స్వాధీనం చేసుకుని, దాని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడు కారు వదిలి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.
కాగా, తనపై పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోక్సో కేసు పెట్టిన బాలికను బలవంతంగా దైవాలగూడ చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తన భార్య, చిన్నారిని కూడా హత్య చేశాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. పోక్సో కేసును మొదటి నుంచే సక్రమంగా దర్యాప్తు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు షాబాద్ ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తమ నిరసనను విరమించారు.
Also Read:
తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్
ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్