Share News

సెమీకండక్టర్ రంగంలో మరో మైలురాయికి చేరిన తెలంగాణ..

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:45 PM

సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి సీఎంపీ (కెమికల్ మెకానికల్ పాలిషింగ్) ప్యాడ్ టెక్నాలజీ హబ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

సెమీకండక్టర్ రంగంలో మరో మైలురాయికి చేరిన తెలంగాణ..
Minister Sridhar Babu

హైదరాబాద్: సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి సీఎంపీ (కెమికల్ మెకానికల్ పాలిషింగ్) ప్యాడ్ టెక్నాలజీ హబ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేసిన ఈ హబ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇవాళ (శనివారం) ప్రారంభించారు. జపాన్‌కు చెందిన తోహో కోకి సంస్థ సాంకేతిక సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


చిప్ తయారీ ప్రక్రియలో అత్యంత కీలకమైన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ ఇకపై హైదరాబాద్‌లో అందుబాటులోకి రావడంతో దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతం లభించనుంది. ఈ హబ్ ద్వారా విద్యార్థులు, స్టార్టప్‌లు, పరిశోధకులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణతో పాటు పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధికి అవసరమైన సహకారం అందించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే 18 నుంచి 24 నెలల్లో దేశీయంగా సీఎంపీ ప్యాడ్ల తయారీని ప్రారంభించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శీధర్ బాబు తెలిపారు.


సెమీకండక్టర్ తయారీకి అవసరమైన కీలక సాంకేతికతలను తెలంగాణలోనే అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోని ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జపాన్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక సెమీకండక్టర్ టెక్నాలజీ అభివృద్ధికి ఈ హబ్ వేదికగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధన నుంచి నైపుణ్యాభివృద్ధి, ప్రోటోటైపింగ్, చిప్ తయారీ వరకు సమగ్ర సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మంత్రి శీధర్ బాబు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

Updated Date - Jul 11 , 2026 | 03:37 PM