కేటీఆర్.. కోట్ల ఆస్తులు మీకు ఎలా వచ్చాయి: ఎంపీ చామల సూటి ప్రశ్న..
ABN , Publish Date - Sep 20 , 2026 | 02:08 PM
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం ఫీల్డ్ విజిట్ చేపట్టింది. ప్రజా భవన్ నుంచి బయలుదేరిన నేతలు.. అజీజ్ నగర్‌లోని మాజీ మంత్రి హరీశ్ రావు ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో భూములు, ఫామ్‌హౌస్‌ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావుకు సంబంధించినవిగా ఆరోపిస్తున్న అజీజ్ నగర్ భూములను కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం ఫీల్డ్ విజిట్ చేపట్టింది. ప్రజా భవన్ నుంచి బయలుదేరిన నేతలు తొలుత అజీజ్ నగర్‌లోని ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ బృందంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ యాదవ్, మల్లు రవి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. 'సిద్దిపేట రంగనాయక్ సాగర్‌లో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. సిద్దిపేటలో లావోని పట్టా భూములను ఆయన బదిలీ చేసుకున్నారు. నేడు అజీజ్ నగర్ ఫీల్డ్ విజిట్‌కి వచ్చాము. తమ ఆస్తులు పూర్వీకుల నుంచి వచ్చాయని కేటీఆర్ అంటున్నారు. తాము ఆగర్భ కోటీశ్వరులమని ఆయన చెబుతున్నారు. వారిది చింతమడక.. ఫామ్‌హౌస్‌లు ఉన్నవి జన్వాడ, ఎర్రవల్లి, అజీజ్ నగర్. ఈ ఆస్తులన్నీ మీ తాతల ఆస్తులని చెబుతున్నారా?.. మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయడం లేదు. సీఎం రేవంత్ ఆన్ రికార్డ్ శాసనసభలో చెప్పిన అంశాలను ప్రజలకు చెబుతున్నాం. జీవో 111 రూల్స్‌ను తుంగలో తొక్కి జన్వాడ, అజీజ్ నగర్‌లో నిర్మాణాలు చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద 300 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గత పదేళ్లుగా దళితులకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?, దోచుకోవాలనే ఉద్దేశంతోనే పట్టాలు ఇవ్వలేదు. పేద ప్రజలను అడ్డుపెట్టుకుని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. మీ ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో ఎందుకు వెల్లడించలేదు?. కేటీఆర్.. ఎమ్మెల్యేగా మీ జీతం ఎంత?. మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి?. 1,600 మంది బలిదానంతో కోట్ల ఆస్తులు కూడబెట్టారు. మేము ప్రైవేట్ ప్రాపర్టీస్ వద్దకు వెళ్లడం లేదు.. మేము అడిగే వాటికి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి సజీవ దహనం..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్