Share News

డ్రగ్స్ రహిత సమాజం కోసం చేతులు కలుపుదాం: హీరో రామ్ పోతినేని

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:18 PM

ఒక్కసారి డ్రగ్స్‌‌కి అలవాటు పడితే.. ఆ వ్యసనం నుంచి బయట పడటం కష్టం అని హీరో రామ్ పోతినేని అన్నారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం చేతులు కలుపుదాం: హీరో రామ్ పోతినేని
Ram Pothineni News

హైదరాబాద్, జూన్ 26: ఒక్కసారి డ్రగ్స్‌కి అలవాటు పడితే.. ఆ వ్యసనం నుంచి బయట పడటం కష్టం అని హీరో రామ్ పోతినేని అన్నారు. హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ పోతినేని మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేది ఒక ఊబి లాంటిదని, జీవితంలో ఒక్కసారి దానికి అలవాటు పడితే మళ్లీ ఆ నరకం నుంచి బయటపడటం దాదాపు అసాధ్యమని చెప్పారు. క్షణికానందం కోసం డ్రగ్స్ వైపు అడుగులు వేసి, అమూల్యమైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. స్నేహితులైనా, మరెవరైనా సరే డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి తెస్తే ఏమాత్రం సంకోచించకుండా ముఖం మీదే ‘నో’ అని గట్టిగా చెప్పాలని పిలుపునిచ్చారు.


తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రామ్ ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 'ఈగల్ ఫోర్స్' (Eagle Force) వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని కొనియాడారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను చేధించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఈగల్ టీమ్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ సామాజిక మహమ్మారిని అంతం చేయడంలో కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని రామ్ కోరారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు. అలాంటి సమాచారాన్ని ధైర్యంగా 1908 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి అధికారులకు అందించాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందంటే..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 26 , 2026 | 07:52 PM