SIRతో ఓటు హక్కు తొలగించే ప్రయత్నం: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:34 PM
హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పట్టభద్రులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: నగరంలోని గాంధీభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పట్టభద్రులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు రావాలని సూచించారు. ఓటు నమోదు ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని.. ఎస్ఐఆర్ ద్వారా జరుగుతున్నాయని తాము ఆరోపిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు పార్టీ నాయకులు.. కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే