Share News

Pawan Kalyan Telangana visit: తెలంగాణ నుంచే ఇవన్నీ నేర్చుకున్నాను..

ABN , Publish Date - Jan 03 , 2026 | 03:34 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందు ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంద మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan Telangana visit:  తెలంగాణ నుంచే ఇవన్నీ నేర్చుకున్నాను..
Pawan Kalyan Telangana visit

జగిత్యాల: జిల్లాలో నిర్వహించిన జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపు–ఓటములు సహజమని, అయితే పోటీ చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాజకీయ జీవితంలో తనకు పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందని, ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తే తనను ముందుకు నడిపించిందని చెప్పారు.


పాలసీ ప్రకారమే పోరాటం

అంజన్న సన్నిధి తనను కాపాడిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కష్టకాలాల్లో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని అన్నారు. ఓటమికి భయపడకుండా పోటీ చేసే మనస్తత్వం జనసేనలో పెరగాలని సూచించారు. పోటీ పడినప్పుడే అనుభవం వస్తుందని, ప్రజల మధ్య ఉండగలమని తెలిపారు. వ్యక్తిగతంగా ఎవ్వరూ తనకు శత్రువులు కాదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, తమ పోరాటం వ్యక్తులపై కాదని, పాలసీ ప్రకారమే జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసం మాత్రమే తాము రాజకీయాల్లో పోరాటం చేస్తున్నామని తెలిపారు.


జనసైనికులు ముందుండాలి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉందని అన్నారు. చివరగా వంద మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.


Also Read:

గృహ జ్యోతి పథకంపై సభలో డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

For More Latest News

Updated Date - Jan 03 , 2026 | 04:02 PM