తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలను ఓ కంట కనిపెట్టండి..
ABN , Publish Date - May 12 , 2026 | 01:24 PM
స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు పండగే. ఈ సెలవులను ఎంజాయ్ చేయడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను బంధుమిత్రుల ఇళ్లకు పంపిస్తుంటారు. వీలుకాని వారు తమ ఇళ్ల వద్దే ఉంచుకుంటారు. పిల్లలు తమ మిత్రులతో సరదాగా ఆడుకుంటారు.
హైదరాబాద్: స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు పండగే. ఈ సెలవులను ఎంజాయ్ చేయడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను బంధుమిత్రుల ఇళ్లకు పంపిస్తుంటారు. వీలుకాని వారు తమ ఇళ్ల వద్దే ఉంచుకుంటారు. పిల్లలు తమ మిత్రులతో సరదాగా ఆడుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. సెలవుల్లో తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఆడుకుంటున్నారు కదా.. స్నేహితులతోనే ఉన్నారు కదా.. అని భావించొద్దు. ఎందుకంటే.. వేసవి కాలం ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. అందుకే ఈ సీజన్‌లో పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ అధికారులు, మీడియా కోడై కూస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచిస్తుంటారు. అయినప్పటికీ ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేసవి సెలవులు వచ్చినప్పటి నుంచీ తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి.. కుక్క కాటుకు చిన్నారి బలి వంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులు, పెద్దలు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేయకండి. సరదా సెలవులను కాస్తా విషాద గుర్తులుగా మారనివ్వకండి.
పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఈత కోసం స్విమ్మింగ్ పూల్స్, బావులు, కొలనులు, చెరువుల వద్దకు వెళ్తుంటారు. పెద్దల పర్యవేక్షణలో ఈతకు వెళ్తే పర్వాలేదు. కానీ, పిల్లలు మాత్రమే ఈతకు వెళ్తే.. జరుగరానిది ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. అందుకే.. పెద్దలు లేనిదే పిల్లలను ఈతకు పంపించకండి. ఈత వచ్చిన వారి వెంటనే మీ పిల్లలను ఈతకు పంపించండి. లేదంటే మొత్తానికే పంపించకుండా ఉండండి.
కుక్కలతో జాగ్రత్త..
వేసవి కాలంలో కుక్కలు మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అవుతాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల కుక్కలు పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తాయని.. ఈ సమయంలో కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీధి కుక్కలు అధికంగా ఉన్న చోట పిల్లలను ఒంటరిగా బయటకు పంపించొద్దని సూచిస్తున్నారు. పిల్లలను కుక్కలు కరిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కుక్కలు కరవడం వలన ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. ఈ వేసవి సీజన్‌లో కుక్క కాటు ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడోచోట పిల్లలపై కుక్కల దాడి అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే.. మీ పిల్లలను ఒంటరిగా అస్సలు బయటకు పంపొద్దు.
Also Read:
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
దారుణం.. టీ తాగుతున్న యువతులపై యువకుల గ్యాంగ్ దాడి..
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు .. త్వరలో కొత్త షెడ్యూల్