ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం.. 12 మంది విద్యార్థుల సస్పెండ్
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:18 PM
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా డెంటల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతంపై ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 17: నగరంలోని ఉస్మానియా డెంటల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతంపై ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. జూన్ తొమ్మిదో తేదీన కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న బీడీఎస్ (BDS) విద్యార్థులు తమపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం, ఆ రోజే సదరు ఫైనల్ ఇయర్ విద్యార్థులను పిలిపించి గట్టిగా మందలించింది. అయితే, యాజమాన్యం హెచ్చరించిన 24 గంటలు తిరగకముందే సీనియర్ విద్యార్థులు మరోసారి ర్యాంకింగ్‌కు పాల్పడ్డారు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాగింగ్‌కు పాల్పడిన మొత్తం 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘జూనియర్లతో సీనియర్లు ఆల్కహాల్, సిగరెట్లు తెప్పించడంతో పాటూ కూలర్లలో నీళ్లు నింపడం వంటి పనులు చేయిస్తూ వేధించేవారు. ర్యాగింగ్ భయంతో మూడో సంవత్సరం చదువుతున్న కొందరు బాధితులు హాస్టల్ గదుల నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయారు. ర్యాగింగ్‌కు పాల్పడిన థర్డ్ ఇయర్ విద్యార్థులపై గతంలోనూ ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన హాస్టల్లోని సీసీ కెమెరాలను పగలగొట్టడమే కాకుండా, ఇతర విద్యార్థులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వగా, సదరు విద్యార్థులు యాజమాన్యానికి క్షమాపణలు చెప్పి, మరోసారి ఇలాంటి తప్పులు చేయబోమని నమ్మించారు. కానీ, వాళ్ల బుద్ధి మారలేదు.. మరోసారి అదే తరహా ప్రవర్తనతో జూనియర్లను వేధించారు. ఈ క్రమంలోనే 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశాం. అలా చేయడం వల్ల పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎంతో ఉంటుందని కాలేజ్ యాజమాన్యం అభిప్రాయం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
దుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాస మహోత్సవం.. తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు
Read Latest AP News And Telugu News