హైదరాబాద్‌లో అధిక వడ్డీల ఆశ చూపి రూ.2 కోట్లకు పైగా మోసం.. కిలాడీ లేడీ అరెస్ట్
ABN , Publish Date - Jun 17 , 2026 | 09:25 AM
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో అధిక వడ్డీల ఆశ చూపి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన నిందితురాలు శ్రీలక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు..
హైదరాబాద్, జూన్ 17: నగరంలోని బంజారాహిల్స్‌లో అధిక వడ్డీల ఆశ చూపి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన నిందితురాలు శ్రీలక్ష్మి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఏడాది కాలంగా పోలీసుల కళ్లు గప్పి పరారీలో ఉన్న ఈ ‘కిలాడీ లేడీ’ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్‌లోని నందినగర్, పరిసర ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని శ్రీలక్ష్మి తన మోసపూరిత నెట్‌వర్క్‌ను నడిపింది. తన వద్ద డబ్బులు దాచుకుంటే ఎవరూ ఇవ్వనంత భారీ మొత్తంలో వడ్డీలు ఇస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను నిజమని నమ్మిన స్థానికులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు బాధితుల నుంచి శ్రీలక్ష్మి వసూలు చేసినట్లు తెలుస్తోంది.
డబ్బులు చేతికి అందిన తర్వాత అసలు వడ్డీ మాట దేవుడెరుగు.. కనీసం డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వకుండా శ్రీలక్ష్మి ఆమె భర్త సత్యప్రసాద్‌తో కలిసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు.. ఏడాది క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, రోజురోజుకూ ఈమె చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య, మోసం చేసిన సొమ్ము విలువ భారీగా పెరుగుతుండటంతో ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు దీనిని బంజారాహిల్స్ పీఎస్ నుంచి సీసీఎస్ (CCS) కు బదిలీ చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు నిందితురాలు శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న ఆమె భర్త సత్యప్రసాద్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో