Share News

మావోయిస్టు ఖైదీలకు మోక్షం లేదా?

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:57 AM

దేశంలో మావోయిస్టు పార్టీని అంతమొందించామని, ఇక తీవ్రవాద కార్యకలాపాలకు అవకాశమే లేదని, యుద్ధం ముగిసిందని కేంద్ర ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది

మావోయిస్టు ఖైదీలకు మోక్షం లేదా?
MAOISTS

  • జైళ్లలోనే మగ్గుతున్న 6 వేల మంది.. విచారణ ఖైదీల విడుదలెప్పుడు?

  • సీరియస్‌.. నాన్‌ సీరియస్‌ కేసులపై నిర్ణయించేది రాష్ట్రాలా.. కేంద్రమా?

  • లొంగిన వారికి రివార్డులు సరే.. జైల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి?

  • జాతీయ స్థాయి విధానం కోసం పలు రాష్ట్రాల పోలీసుల నిరీక్షణ

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో మావోయిస్టు పార్టీని అంతమొందించామని, ఇక తీవ్రవాద కార్యకలాపాలకు అవకాశమే లేదని, యుద్ధం ముగిసిందని కేంద్ర ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. మావోయిస్టు పార్టీలోని అగ్రనేతలతో పాటు.. కిందిస్థాయి క్యాడర్‌ కూడా లొంగిపోవడంతో పోలీసు వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. జనజీవనంలోకి వచ్చిన వారికి స్థాయిని బట్టి ప్రభుత్వం రివార్డుల కింద నగదును అందించింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. వివిధ కేసుల్లో జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టు ఖైదీలకు మాత్రం మోక్షం లభించడంలేదు. మావోయిస్టులతో యుద్ధం ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఏడాది మార్చి 30న పార్లమెంట్‌లో ప్రకటించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోని 21 మంది పోలిట్‌బ్యూరో సభ్యుల్లో ఇప్పుడు 20 మంది లేరని స్పష్టం చేశారు. ఒకరు అరెస్టు అయ్యారని, ఏడుగురు లొంగిపోయారని, మరో 12మంది కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారని అమిత్‌షా పార్లమెంట్‌సాక్షిగా వివరించారు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలోని ఏ ప్రభుత్వమైనా ఆయా యుద్ధానికి సంబంధించిన కేసుల్లో పట్టుబడి జైళ్లలో ఉన్న వారిని వదిలివేస్తారు. కానీ, ప్రస్తుతం మావోయిస్టు పార్టీతో యుద్ధం ముగిసిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా జైళ్లల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న మావోయిస్టు ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు మాత్రం విడుదల కావడంలేదు. మావోయిస్టు పార్టీ ఖైదీల విడుదలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని పరోక్షంగా కేంద్రం సూచించడంతో వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు సందిగ్ధంలో పడిపోయారు.


లొంగిపోయిన నేతలు రివార్డులతో గ్రామాలకు చేరుకోగా.. జైళ్లలోనే ఉంటున్న తమవారు ఎప్పుడొస్తారని మావోయిస్టు ఖైదీల కుటుంబసభ్యుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాము పార్టీని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చామని, తమతో పార్టీలో పనిచేసి ప్రస్తుతం జైళ్లల్లో ఉన్న నేతలు, కార్యకర్తలను వదిలిపెట్టాలని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు దేవ్‌జీ, సంగ్రామ్‌ చంద్రన్న తదితరులు వివిధ సందర్భాల్లో డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. యుద్ధంలో ఇరువైపులా నష్టం జరుగుతుందని, యుద్ధం తర్వాత శాంతి ఉండాలి అంటే మావోయిస్టు పార్టీపై తక్షణమే నిషేధం ఎత్తివేసి, జైళ్లల్లో ఉన్న నక్సల్స్‌ ఖైదీలందర్నీ విడుదల చేయాలని వివిధ సందర్భాల్లో కోరుతూనే ఉన్నారు. దీనికి జవాబు ఇవ్వలేని నిస్సహాయ స్ధితిలో ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. మరోవైపు పౌరహక్కుల సంఘాలు, మేధావి వర్గం సైతం మావోయిస్టు ఖైదీల విడుదలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లొంగిపోయిన వారికి రివార్డు.. జైల్లో ఉన్న వారికి శిక్షా? ఇదీ శాంతి వైపా లేక మరో ఆందోళనకు బీజమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు సేకరించిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీకి చెందిన ఖైదీలు 6000 మందికిపైగా ఉండగా.. వారిలో 75 శాతం విచారణ ఖైదీలే ఉన్నారు.

విదుదలపై ఎవరు నిర్ణయం తీసుకోవాలి?

మావోయిస్టులకు షెల్టర్‌ ఇచ్చారని, అన్నం పెట్టారని, కరపత్రాలు పంచారని, పార్టీ కొరియర్లుగా పనిచేశారని ఇలా వివిధ కారణాలతో అరెస్టు అయిన వందలాది మంది మావోయిస్టులు జైళ్లలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉన్నారు. వీరికి తోడు ఉపా చట్టం కింద అరెస్టు అయిన వారు, ఎన్‌ఐఏ కేసుల్లో పట్టుబడిన వారు జైళ్లల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. శిక్ష పడిన ఖైదీలు వందల మంది జైళ్లల్లో ఉన్నారు. కేవలం విచారణ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండటం ఆందోళనకర పరిణామంగా నిలుస్తోంది.


మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఖైదీల విషయంలో సీరియస్‌, నాన్‌ సీరియస్‌ కేసులన్న వాదనను ఇటీవల ప్రభుత్వ వర్గాలు చర్చకు తీసుకుని వచ్చాయి. చిన్న కేసుల్లో ఉన్న వారి విడుదలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చునని, హత్యలు, పోలీసులపై దాడులు, కుట్ర కేసుల్లో ఉన్న వారిపై చట్టం తనపని తాను చేసుకునిపోతుందని అంటున్నారు. పార్టీ చెప్పినట్లు నడిచి చివరిదశలో లొంగిపోయిన వారికి రివార్డులు ఇస్తున్న ప్రభుత్వం.. అవే నేరాలు చేసిన వారిపై ఎందుకు వివక్ష చూపుతోందని లొంగిపోయిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ జీరం ఘాటీ కేసులో 10 మంది ఆదివాసీలకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఉరిశిక్షను రద్దు చేయాలని, వారి మీద కేసులన్ని కొట్టివేసి విడుదల చేయాలని ఈ ఏడాది సెప్టెంబరు 29న మాజీ మావోయిస్టు నేతలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రాన్ని కోరారు.

cv-anand-crackers.jpgఎలాంటి మార్గదర్శకాలు అందలేదన్న డీజీపీ

ప్రభుత్వం మాట విని లొంగిపోయిన 824మంది మావోయిస్టులకు రూ.17కోట్లు పునరావాస ప్యాకేజీ ఇచ్చామని, జైళ్లల్లో ఉన్న ఖైదీల విడుదలకు సంబంధించి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ సోమవారం జరిగిన మావోయిస్టుల పునరావాస పంపిణిలో స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతున్న కేసుల్లో కేంద్రం జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిందని, చిన్న చిన్న కేసుల విషయంలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఖైదీల విడుదలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.


maoist.jpgకేసులు రద్దు చేయాలి: దేవ్‌జీ

మావోయిస్టు సమస్య ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన క్రమంలో జైళల్లో ఉన్న నక్సల్స్‌పై కేసులు రద్దు చేసి వారిని విడుదల చేయాలని మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ డిమాండ్‌ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 6వేల నుంచి 8 వేల వరకు మావోయిస్టులు వివిధ జైళ్లలో ఉన్నారని, వీరిలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, శిక్షలు పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీతో యుద్ధం ముగిసిందని చెప్పిన తర్వాత జైళ్లలో ఉన్న వారిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా విడుదల చేయడం సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు?

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్

Updated Date - Nov 27 , 2026 | 04:01 AM