Share News

వాగులో ఈతకు వెళ్లి యువకుడి మృతి

ABN , Publish Date - Oct 18 , 2026 | 07:05 PM

దసరా పండుగ సందర్భంగా సెలవులు నేపథ్యంలో స్వగ్రామంలో ఇంటికి వచ్చిన ఓ యువకుడు వాగులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారంలో చోటు చేసుకుంది.

వాగులో ఈతకు వెళ్లి యువకుడి మృతి

సూర్యాపేట, అక్టోబర్18: దసరా పండుగ సందర్భంగా సెలవుల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడు వాగులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారంలో చోటు చేసుకుంది. ఆదివారం వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఆత్మకూరు (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన బన్నీ నీట మునిగి మృతి చెందాడు. దసరా పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు అతడు స్వగ్రామం ముక్కుడుదేవులపల్లికి వచ్చాడు.


అనంతరం తన స్నేహితులతో కలిసి గుండ్ల సింగారంలోని వాగులో ఈతకు వెళ్లాడు. ఆ సమయంలో అతడు ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఈ విషయాన్ని గమనించిన స్నేహితులు బన్నీని రక్షించేందుకు ప్రయత్నించారు. స్థానికుల సహాయంలో అతడిని వాగులో నుంచి బయటకు తీసుకొచ్చారు.

ఆ తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బన్నీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పండుగ వేళ తమ మధ్య ఆనందంగా గడపాల్సిన బన్నీ ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 07:12 PM