వృద్ధ దంపతులకు అండగా కలెక్టర్.. వేధించిన కొడుకును ఇంటి నుంచి గెంటేసి..
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:37 PM
కన్నప్రేమను మరిచి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నడిరోడ్డుపై నిలబెట్టిన ఓ కుమారుడికి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గట్టిగా బుద్ధి చెప్పారు.
మిర్యాలగూడ, జూన్ 06: కన్నప్రేమను మరిచి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నడిరోడ్డుపై నిలబెట్టిన ఓ కుమారుడికి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గుణపాఠం చెప్పారు. కన్నవారిని ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్న కుమారుడిపై 'వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007' ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు. అధికారులు సదరు ఇంటిని స్వాధీనం చేసుకుని, తిరిగి ఆ వృద్ధ దంపతులకు అప్పగిండంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిర్యాలగూడకు చెందిన వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టార్జితంతో ఒక ఇల్లు నిర్మించుకున్నారు. అయితే, వారి కుమారుడు గత కొంతకాలంగా తల్లిదండ్రులను తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతటితో ఆగకుండా, వారిని ఇంట్లోకి కూడా రానివ్వకుండా తాళం వేసి రోడ్డున పడేశాడు. ఆ వయసులో ఆసరాగా నిలవాల్సిన కొడుకే ఇలా కసాయిగా మారడంతో.. ఆ వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదనతో న్యాయం కోసం అధికారులను ఆశ్రయించారు. ఈ హృదయ విదారక ఉదంతం నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ దృష్టికి వెళ్ళింది. వృద్ధుల ఫిర్యాదుపై ఆయన తక్షణమే స్పందించారు.
'తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమ చట్టం - 2007' నిబంధనల ప్రకారం... ఆ ఇంటిపై వృద్ధులకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొంటూ.. తక్షణమే ఆ ఇంటిని కుమారుడి నుంచి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ రెవెన్యూ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల ఇంటి వద్దకు చేరుకుని, వారి కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించారు. అనంతరం ఆ ఇంటి తాళాలను సదరు వృద్ధ దంపతులకు అందజేశారు. కలెక్టర్ చూపిన చొరవపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీ నుంచి పిలుపు!
భీమిలిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల అరెస్ట్