హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై రాజా సింగ్ దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:41 PM
హైదరాబాద్.. నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దాండియా ఉత్సవం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దాండియా ఉత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుమార్తెను కోల్పోయిన కుటుంబానికి ఈ విషాద సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని.. కళాశాలల్లో నిర్వహించే కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కళాశాలల్లో దాండియా వంటి సాంస్కృతిక ఉత్సవాలు.. ఇతర వేడుకలు నిర్వహించే సమయంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాజా సింగ్ సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, అవసరమైన అనుమతులు తీసుకోవాలని, నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కళాశాల యాజమాన్యాలు, ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక