ములుగులో విషాదం.. నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్ల మృతి
ABN , Publish Date - Sep 20 , 2026 | 07:46 PM
ములుగులో విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు మండలం కాశీందేవిపేటలో నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
ములుగు, సెప్టెంబర్ 20: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ములుగు మండలం కాశీందేవిపేటలో నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. సెలవు కావడంతో తండ్రి ఎండి అంజద్ పాషా తన ఇద్దరు కుమార్తెలను పొలం వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో నీళ్లు తెచ్చేందుకు కుంట వద్దకు వెళ్లిన చిన్న కుమార్తె ఆసియా (9) ప్రమాదవశాత్తు నీటిలో జారిపడింది. ఆసియా నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన పెద్ద కుమార్తె సమిత్ (18) ఆమెను కాపాడేందుకు కుంటలోకి వెళ్లింది. అయితే ఆమె కూడా ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయింది. ఇద్దరు కుమార్తెలు కళ్లముందే నీటిలో మునిగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
స్థానికులు వెంటనే స్పందించి ఇద్దరినీ బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కాశీందేవిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. సెలవు రోజున సరదాగా పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.
కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క
నీటి కుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందడంపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి.. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం
Read Latest Telangana News And AP News