Share News

తెలంగాణ రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు..

ABN , Publish Date - Mar 14 , 2026 | 07:21 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని గంటల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో భారీ ప్రాణ నష్టం సంభవించింది. మెదక్, వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు..
Telangana Road Accidents

ఇంటర్నెట్ డెస్క్: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. కానీ, కొంతమంది డ్రైవర్లు ఇవి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర(Telangana State) వ్యాప్తంగా గత కొన్ని గంటల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో(Accidents) భారీ ప్రాణ నష్టం సంభవించింది. మెదక్, వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని(Tragedy) నింపాయి.


మెదక్ జిల్లాలోని(Medak District) కొల్చారం మండలం రాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో తండ్రీ కొడుకులు అమృత్ గౌడ్(51), రిశివర్ధన్ గౌడ్(13) తో పాటు సాయి గౌడ్(32) ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా(Warangal District) మామునూరు పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూటీని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) ఆర్మూర్ మండలం పిప్రి వద్ద ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో శ్రీనివాస్, విజయ్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా(Suryapet District) తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల శివారులో వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా క్రేన్ లోపల పడటంతో ముగ్గురు వ్యక్తులు సుకిన దేవారావు, బండారి అభిలాశ్, సరిగోమ్ముల పైడి ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గద్దలగూడెంలో కరెంట్ వైరు వాగులో పడటంతో నీరు తాగడానికి వెళ్లిన 15 గొర్రెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి.

ఇదిలా ఉంటే.. కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన విజయ్(10 ) సింహాద్రి (09) ఇద్దరు విద్యార్థులు వారం రోజుల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) పల్లె‌వారి కుంటలో ఆ ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో జారిపడటం వల్ల చనిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

Updated Date - Mar 14 , 2026 | 07:35 PM