బీసీ-ఏలోకి ముదిరాజ్!
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:11 AM
గంగపుత్రులను ఒప్పించి ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
అందర్నీ ఒప్పించి మారుస్తాం
న్యాయ నిపుణులను సంప్రదిస్తాం
వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం
సంక్షేమం నాది, ఎన్నికల బాధ్యత మీది
ఇందిరమ్మ ఇల్లు కట్టని ఊర్లో ఓటడగను
బాబు, వైఎస్, కేసీఆర్ పథకాల్ని కొనసాగిస్తూ
గత ప్రభుత్వాల కన్నా రెట్టింపు సంక్షేమం
కులగణనలో తేడాలుంటే చెప్పండి, దిద్దుతాం
రాహుల్ ప్రధానైతే బహుజనులు బాగు
పండుగ సాయన్న జయంతి సభలో సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గంగపుత్రులను ఒప్పించి ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతామన్నారు. రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కులగణన లెక్కలు లేనందునే ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు ఇప్పటి వరకు మార్చలేక పోయారని తెలిపారు. ఈ అంశంపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తానని ప్రకటించారు. ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించే విషయాన్ని ప్రజలు చూసుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమాన్ని తాను చూసుకుంటానని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లోనే తాను వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని ప్రకటించారు. ఇల్లులేని పేదల కోసమే తమ సర్కారు 8 లక్షల ఇళ్లనుకట్టిస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల కన్నా రెట్టింపు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం ప్రస్తావించారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తే తాము సన్నబియ్యం ఇస్తున్నామని, అదీ ఏకంగా 3.48 కోట్ల మందికి అందిస్తున్నామని చెప్పారు.
ఎన్టీఆర్, చంద్రబాబు, వై.ఎస్., కేసీఆర్‌లు ప్రవేశపెట్టిన మంచి పథకాలను ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు ఉచిత బస్సు, రైతు పెట్టుబడి అమలు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని, బీసీ కుల గణన చేపట్టామని తెలిపారు. ఏ కులం వారైనా సరే తమ లెక్క తప్పుగా ఉందని భావిస్తే గణాంకాల్లోకి రానివారి వివరాలు తీసుకువచ్చి ఇవ్వాలని కోరారు. కులగణన లెక్కల్లో తేడాలుంటే వివరాలు ఇవ్వాలని, వాటిని రానున్న కేబినెట్ భేటీలో చర్చించి సరిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ వివరాలను పరిశీలించి జాబితాలో కలుపుతామని, దీనిపై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తామని అన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులేనని, వారు ఎంతో విశ్వసనీయమైన వారని వ్యాఖ్యానించారు. 1999లో తాను తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ పడినపుడు ముదిరాజులే అండగా నిలిచారని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిని కాగానే శ్రీహరి ముదిరాజ్‌ను డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించానని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు, మంత్రి పదవి కూడా కల్పించామని, ముదిరాజ్ బిడ్డ నీలం మధుకు సైతం ఎంపీ టికెట్ ఇచ్చామని ప్రస్తావించారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.
సన్న వండ్లు పండించాలన రైతులకు చెబితే కొందరు అవహేళన చేశారని, ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, ఇది రైతులకు ప్రయోజనం కలిగించే అంశమని చెప్పారు. బహుజనుల జీవితాలు బాగుపడాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నారు. రాహుల్‌కు అండగా నిలవాలని ముదిరాజ్‌లను కోరారు. సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. భూస్వాములు తన భూమిని ఆక్రమించుకునప్పుడు పండుగ సాయన్న ఎదురు తిరిగారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పండుగ సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేేస్త నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి సాయన్నను విడిపించారని తెలిపారు. ట్యాంక్ బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!