22-ఎకి సంబంధించి ఒక్క దరఖాస్తూ.. పెండింగ్ లో ఉండటానికి వీల్లేదు
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:57 AM
‘‘సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఈ భూములకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో ఉండటానికి వీల్లేదు’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అన్నారు
యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఈ భూములకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లో ఉండటానికి వీల్లేదు’’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అన్నారు. 22-ఎ సమస్యల పరిష్కారానికి ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22-ఎ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో జీవో 118, జీవో 76లకు సంబంధించి మెమోలు ఇచ్చామన్నారు. 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మునిసిపల్ అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించామని తెలిపారు. యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారం, నాలా పూర్తికాని పట్టా భూముల సమస్యల పరిష్కారం, జీవో 59 అమలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. యూఎల్‌సీకి సంబంధించి వివిధ కోర్టులు వెలువరించిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసే అంశాలపై వారం రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ సమగ్ర నివేదిక అందించాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!
రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి