Share News

జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 08:47 PM

జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులకు సుపారీ ఇచ్చి మామ శ్రీనివాస్‌ని అల్లుడు బస్వరాజ్ హత్య చేయించాడని పోలీసులు తెలిపారు.

జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
zaheerabad police

సంగారెడ్డి, అక్టోబర్ 12: జహీరాబాద్‌లో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులకు సుపారీ ఇచ్చి మామ శ్రీనివాస్‌ని అల్లుడు బస్వరాజ్ హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. తన స్నేహితులు రమేశ్, సుభాష్, మురళిలతో కలిసి మామ హత్యకు రూ.5 లక్షలకు బస్వరాజ్ ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. అందుకోసం అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు ఇచ్చి.. హత్య అనంతరం మిగతా నగదు ఇస్తానని స్నేహితులకు హామీ ఇచ్చాడని వివరించారు. అల్లుడు బస్వరాజ్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని జహీరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.


కుటుంబ కలహాలతోనే పిల్లనిచ్చిన మామను స్నేహితులతో కలిసి బస్వరాజ్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకి చెందిన బస్వరాజ్‌కు కుమార్తెను ఇచ్చి శ్రీనివాస్ వివాహం జరిపించాడని అన్నారు. కుటుంబ కలహాలతో గత మూడేళ్లగా శ్రీనివాస్ కుమార్తె పుట్టింటి వద్దే ఉంటుందని తెలిపారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుందని.. భరణం కింద బస్వరాజ్ ఆస్తిలో సగం ఇవ్వాలంటూ భార్య కోర్టులో పిటిషన్ వేసిందని వివరించారు. దీంతో భార్య, అత్తమామలపై అతడు కక్ష పెంచుకున్నాడని చెప్పారు.


శ్రీనివాస్‌ను ఎలాగైనా హత్య చేయాలని స్నేహితులతో కలిసి బస్వరాజ్ ప్లాన్ వేశాడని అన్నారు. దీంతో అక్టోబర్ 7వ తేదీన శ్రీనివాస్ ఆటోని ముందుగా ప్లాన్ ప్రకారం కిరాయికి బస్వరాజ్ స్నేహితులు మాట్లాడుకున్నారని తెలిపారు. దారి మధ్యలో మద్యం తీసుకుని తూముకుంట శివారులో నిర్మానుష్య ప్రాంతానికి శ్రీనివాస్‌ను తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ అల్లుడు ఎంట్రీ ఇచ్చి.. శ్రీనివాస్‌పై స్నేహితులతో కలిసి దాడి చేసి హత్య చేశాడని అన్నారు. అనంతరం మృతదేహాన్ని, ఆటోని పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడి నుంచి వారంతా పరారయ్యారని జహిరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 08:51 PM