కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:47 PM
మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 9: పఠాన్‌చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మహిపాల్ రెడ్డి, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి సహా కొందరు అనుచరులు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తమ నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనాలు రాలేదన్న కారణంతో.. మహిపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన అధికారికంగా బీఆర్‌ఎస్‌లో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మహిపాల్ రెడ్డి.. ప్రస్తుతం ఆ పార్టీపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.