Share News

భారతదేశం ముక్కలవ్వలేదంటే అంబేడ్కర్ కారణం: హరీశ్ రావు..

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:08 PM

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తడకపల్లిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కొందరివాడు కాదని.. అందరి వాడని వ్యాఖ్యానించారు.

భారతదేశం ముక్కలవ్వలేదంటే అంబేడ్కర్ కారణం: హరీశ్ రావు..
MLA Harish Rao

సిద్దిపేట: ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉందంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి వల్లేనని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం చాలా దేశాలు ముక్కలవుతున్నాయని, అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాలున్నా దేశం ఒక్కటిగా వర్ధిల్లుతుందన్నారు. అందుకు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. ఈరోజు(మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తడకపల్లిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కొందరివాడు కాదని.. అందరి వాడని వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ..'చాలా దేశాలు విడిపోతున్నాయి. అంతర్యుద్ధాలతో సతమతమవుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దేశం ఒక్కటిగానే ఉంది. అందుకు అంబేడ్కర్ మహానుభావుడే కారణం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా దశాబ్దాలు పట్టింది. కానీ, మన రాజ్యాంగంలో మహిళలు, పురుషులు, కోటీశ్వరులు, పేదవారనే తేడా లేకుండా అంబేడ్కర్ అందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నాంది పలికారు. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించారు. యువత బాబాసాహెబ్‌ను చూసి స్ఫూర్తి పొందాలి. అణగారిన వర్గాల కోసం ఆయన కృషి చేశారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ తెచ్చారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ పెట్టి రెండున్నర ఏళ్లయినా ఒక్క హామీ అమలు చేయలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక మధ్యలోనే చదువులు ఆగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ను డమ్మీ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ఆగిపోయింది. సెక్రటేరియట్‌కి అంబేడ్కర్ పేరు పెట్టాం. దేశంలో ఏ రాష్ట్రం అలా చేయలేదు. అంబేడ్కర్ ఆలోచనతోనే తెలంగాణ వచ్చింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ పెట్టారని రేవంత్ రెడ్డి ఆ విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయడం లేదు' అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అంబేడ్కర్ కొందరి వాడు కాదు.. అందరి వాడు: కేటీఆర్

దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Apr 14 , 2026 | 01:29 PM