Share News

స్వగ్రామానికి మావోయిస్టు చందర్ మృతదేహం.. కన్నీటి పర్యంతమైన ఇస్రోజీవాడి

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:29 PM

పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావో నేత లోకోటి చందర్ మృతదేహం ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది భూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పౌరహక్కుల సంఘాల నేతలు వాపోయారు.

స్వగ్రామానికి మావోయిస్టు చందర్ మృతదేహం.. కన్నీటి పర్యంతమైన ఇస్రోజీవాడి
Lokoti Chander, Maoist leader

కామారెడ్డి, ఫిబ్రవరి 8: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత లోకోటి చందర్ అలియాస్ స్వామి మృతదేహం ఇవాళ (ఆదివారం) ఆయన స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చేరుకుంది. చందర్ మృతదేహాన్ని చూడగానే కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నివాళులర్పించిన పౌరహక్కుల సంఘాల నేతలు

చందర్ అంత్యక్రియల నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇస్రోజీవాడికి తరలివచ్చారు. చందర్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు.


'ఆపరేషన్ కగార్' నిలిపివేయాలి

ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గడ్చిరోలిలో జరిగిన ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ పూర్తిగా బూటకమని వారు ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అడవి బిడ్డలను, విప్లవకారులను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న'ఆపరేషన్ కగార్'ను తక్షణమే నిలిపివేయాలని నినదించారు.

ప్రభుత్వాలు తుపాకీ గుళ్లతో సమస్యలను పరిష్కరించలేవని, నిర్బంధాలను ఆపాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. భారీగా తరలివచ్చిన జనం మధ్య మావోయిస్టు చందర్ అంత్యక్రియలు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి..

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..

Updated Date - Feb 08 , 2026 | 05:09 PM