మంత్రుల సభను బహిష్కరించిన మత్స్యకారులు
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:06 AM
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ రసాభాసగా మారింది.
తమను రెండు వర్గాలుగా విడదీశారంటూ పెద్దపెట్టున నినాదాలు
ఖాళీ కుర్చీల మధ్యే సాగిన సభ
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఘటన
కొల్లాపూర్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ రసాభాసగా మారింది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో శనివారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సభా వేదికపైకి చేరుకోగానే మత్స్యకారులు నిరసనకు దిగారు. కుర్చీలను తోసేస్తూ సభ నుంచి వెనుదిరిగారు. వాస్తవానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మత్స్యకారులు ఐక్యంగా కొల్లాపూర్‌లో మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ ఏడాది పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన విభేదాలతో మత్స్యకారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అధికార పార్టీ ప్రోద్బలంతో కల్వకోలులో ఒక వర్గం వేడుకలు నిర్వహించగా, ఇతర పార్టీల మద్దతుతో మరో వర్గం కొల్లాపూర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగింది.
శనివారం ఉదయం కల్వకోలులో జరిగిన పండుగ సాయన్న విగ్రహావిష్కరణ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో కొల్లాపూర్‌లో నిర్వహించిన సభకు వచ్చారు. అయితే, మంత్రులను చూడగానే సభకు హాజరైన మత్స్యకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కల్వకోలులో సభతో మత్స్యకారుల ఐక్యతను దెబ్బ తీసి, మళ్లీ ఈ సభకు ఎలా వస్తారంటూ నినాదాలు చేశారు. మత్స్యకారులందరూ బయటకు వెళ్లిపోవడంతో సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. నిర్వాహకులు రంగంలోకి దిగి మత్స్యకారులను సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఖాళీ కుర్చీల మధ్యే సభ కొనసాగింది.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక