Share News

మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు.. పోలీసుల దాడులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:37 PM

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో పోలీసులు ఇవాళ విస్తృత దాడులు చేశారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో సోదాలు జరిపారు.

మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు.. పోలీసుల దాడులు
Nagar Kurnool Police Raids

నాగర్‌కర్నూల్, జనవరి 24: తెలంగాణ రాష్ట్రం అమ్రాబాద్ ప్రాంతంలో ఇవాళ (శనివారం) పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. మావోయిస్టు సభ్యులకు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అడ్ల అంబయ్య, జక్క బాలయ్య నివాసాల్లో తనిఖీలు చేశారు.

ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆధ్వర్యంలో మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులకు నిఘా సమాచారం అందిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో DKSZC సెక్రటరీ సల్మాన్, ఆయన భార్య సుకుమ సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది.


కాగా, ఈ సోదాల సమయంలో పోలీసులు కొన్ని డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, సామాజిక సంఘాల సంబంధిత మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. మావోయిస్టు కనెక్షన్లు, ఆర్థిక సహాయం, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

అమ్రాబాద్ ప్రాంతం తెలంగాణలో మావోయిస్టు ప్రభావం ఉన్న ఏరియాల్లో ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇక్కడ పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ దాడులు మావోయిస్టు నెట్‌వర్క్‌ను బలహీనపరచడానికి, సపోర్టర్లను గుర్తించడంలో భాగమేనని పోలీస్ అధికారులు అంటున్నారు. ఇవి సమీప భవిష్యత్ లోనూ కొనసాగుతాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, ప్రజా సంఘాల నేతల్ని అదుపులోకి తీసుకున్నా.. వారి బంధువులు, సహచరులు ఇది రాజకీయ హింస, ప్రజా ఉద్యమాలపై దాడి అని ఆరోపిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఏజెంటిక్‌ ఏఐలో కొలువులే కొలువులు

మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..

Updated Date - Jan 24 , 2026 | 02:18 PM