మద్రాస్ రెజిమెంటల్ ఆయుధాల చోరీ కేసులో వీడని మిస్టరీ.. రంగంలోకి ఎన్ఐఏ
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:51 AM
మద్రాస్ రెజిమెంటల్ ప్రాంగణం నుంచి ఆయుధాలు మాయమైన ఘటనలో పది రోజులు గడిచినా మిస్టరీ వీడడం లేదు. ఆయుధాలు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు మాయం చేశారు? ఎలా బయటకు తరలించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు. కేసు దర్యాప్తులోకి ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది..
హైదరాబాద్, సెప్టెంబర్ 9: నగరంలోని మద్రాస్ రెజిమెంటల్ ప్రాంగణం నుంచి ఆయుధాలు మాయమైన ఘటనకు పది రోజులు గడిచినా కేసులో మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఆయుధాలు ఎలా మాయమయ్యాయి? వాటిని క్యాంపస్ నుంచి ఎలా బయటకు తరలించారు? ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఎన్ఐఏకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణాన్ని పరిశీలించింది. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఆయుధాల మాయం కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులతో సమావేశమై ఇప్పటివరకు సేకరించిన వివరాలను తెలుసుకుంది.
ముఖ్యంగా మాయమైన ఆయుధాలు ఏ మార్గంలో బయటకు వెళ్లి ఉంటాయన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ క్యాంపస్ భద్రతా వ్యవస్థ, ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ ప్రాంతాలు, అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు దర్యాప్తు బృందాల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో క్యాంపస్‌లో పనిచేసే సిబ్బంది, భద్రతా విధుల్లో ఉన్నవారు, ఇతర అనుమానితుల కదలికలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఎన్ఐఏ రంగంలోకి దిగడంతో ఇప్పటివరకు వెలుగులోకి రాని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు బొల్లారం పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పలు ప్రత్యేక బృందాలుగా విభజించి.. ఒక్కో బృందానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యాంపస్‌లోని డ్రైనేజీలో ఒక మ్యాగజైన్ లభించడంతో కేసులో కీలక ఆధారం దొరికిందని భావించినప్పటికీ.. అది చోరీకి గురైన ఆయుధాలకు సంబంధించినదిగా పోలీసులు నిర్ధారించలేకపోయారు. అంతేకాకుండా దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా మ్యాగజైన్‌ను అక్కడ పడేసి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో మ్యాగజైన్ అక్కడికి ఎలా చేరింది, దానిని ఎవరు పడేశారు అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
213 అడుగుల ఎత్తు నుంచి కారుతో బంజీ జంప్
చేజేతులా కాళ్లు విరగొట్టుకున్నాడు.. వీడియో వైరల్