కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలపై కేసు..
ABN , Publish Date - Sep 09 , 2026 | 09:39 AM
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ మూడో నంబర్ గేట్ వద్ద జరిగిన ఘటనపై తాజాగా మరో కేసు నమోదైంది. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 9: నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీఆర్‌ఎస్ నాయకులపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా.. అసెంబ్లీ మూడో నంబర్ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడ్డారని మహిళా కానిస్టేబుల్ పద్మావతి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కొందరు బీఆర్‌ఎస్ నాయకులు టీషర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో మహిళా పోలీసులకు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని, అనంతరం వారికి ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఎమ్మెల్యే హరీశ్‌రావు, నవీన్‌రెడ్డి, డి. సుధీర్‌రెడ్డి, కేటీఆర్‌తో పాటు మరికొందరి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 సెక్షన్లతో పాటు 3(5) కింద కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన ఘటనపై ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా నమోదైన కేసుతో వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్.. వీడియో వైరల్
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..