పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు అడ్డుకుంటాం
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:06 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడివైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను అడ్డుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు
బీఆర్‌ఎస్ అనవసర విమర్శలు ఆపాలి
ఏపీ ప్రాంత అధికారి వల్లే సమాచార లోపం
నాగార్జునసాగర్ ఎస్‌ఈ మల్లికార్జున్‌ను కొనసాగించడమే మా పొరపాటు
రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడివైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను అడ్డుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, అలాంటిది పల్నాడు వాటర్ గ్రిడ్‌పై ఎందుకు రాజీ పడతామని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు సకాలంలో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఏపీ ప్రాంతానికి చెందిన అధికారి సమాచార లోపం వల్లే విషయం ప్రభుత్వానికి తెలియలేదని చెప్పారు. నాగార్జునసాగర్ ఎస్‌ఈ మల్లికార్జున్ ఏపీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, అతన్ని తెలంగాణలో కొనసాగించడమే తమ పొరపాటని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. వాటర్ గ్రిడ్ పనుల సంగతి చాలా కాలం క్రితమే తెలిసినా ఆయన ప్రభుత్వానికి తెలియజేయలేదని చెప్పారు. .
ఈ విషయం తెలిశాక తాను ఎస్‌ఈకి ఫోన్ చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించానని వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కుట్ర పన్ని ఇలా మోసం చేశారని తెలిపారు. కావాలని ఎవరూ తప్పు చేయరని, పల్నాడు వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఆపేందుకు కలిసిరావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. పనులు ఎప్పుడు మొదలయ్యాయనేది సమస్య కాదని, వాటిని ఎలా అడ్డుకోవాలనేదే ఇప్పుడు ఆలోచించాల్సిన అంశమన్నారు. కేంద్ర జలజీవన్ మిషన్ పథకం కింద ఈ పనులు కొనసాగిస్తున్నందున కేంద్రం కూడా ఆలోచించాలన్నారు. ఎగువన ఉన్న రాష్ట్రానికి నీటి వాటాలు తగ్గించి, దిగువకు నీటిని తీసుకెళ్లడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అనవసర విమర్శలు మానుకొని పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను అడ్డుకునేందుకు ముందుకురావాలని సూచించారు ప్రమాదం వల్ల ఆగిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు
ఇవి కూడా చదవండి..
అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..