Share News

మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:24 PM

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఆయున స్పష్టం చేశారు.

మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Kishan Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తన పేరును మార్చి పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘మీరు రేవంత్‌ ఖాన్‌ అని మార్చుకోండి.. మాకు అభ్యంతరం లేదు. కానీ.. మా తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? మాపై వ్యక్తిగత విమర్శలు సరికాదు. మీకు దెయ్యాలు.. దేవతల్లా కనపడవచ్చు. మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్నాళ్లూ.. మేం నిప్పులు పోస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాను ఎవ్వరికీ దత్తపుత్రుడ్ని కాదని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే తేల్చుకోవాలని, తనను మధ్యలో లాగడం ఎందుకని ప్రశ్నించారు. తన గురించి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుండా కిషన్‌ రెడ్డి పేరు మారుస్తానని అంటున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డురాకుండా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ.. ఒక్క రోజూ కేసీఆ‌ర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని విమర్శించారు. తామెప్పుడూ బీఆర్‌ఎస్‌తో కలవలేదని తేల్చిచెప్పారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని గుర్తుచేశారు. ఇప్పుడేమీ చేయలేక తనపై ఆడి పోసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదా? కిషన్ రెడ్డిదా.? అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు.


మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తలాతోకా లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ రెండేళ్లుగా మాటలతో కాలయాపన చేశారని.. ఏం చేస్తారో చేతల్లో చూపించాలన్నారు. ఇచ్చిన మాటపై నిలబడే శక్తి లేకపోతే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్‌ బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కిషన్‌ రెడ్డి కోరారు.


ఇవి కూడా చదవండి..

రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే: బండి సంజయ్

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 05:03 PM