పేదలకు మంచి చేసే విషయంలో వెనక్కి తగ్గం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:59 AM
రాష్ట్రంలో కరవు పరిస్థితులను గుర్తించి.. రెండో పంట సాగు చేయొద్దని రైతులకు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఖమ్మం, అక్టోబర్ 25: రాష్ట్రంలో కరవు పరిస్థితులను గుర్తించి.. రెండో పంట సాగు చేయొద్దని రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కొనడానికి కూడా దొరకడం లేదని అన్నారు. రాష్ట్రంలో నెలకున్న కరవు పరిస్థితులపై సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీల నుంచి సూచనలు తీసుకుంటామని చెప్పారు. పేదలకు మంచి చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని పేర్కొన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో రూ.38 కోట్లతో చేపట్టిన రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేయని కార్యక్రమాలు ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంటే తమపై విషం కక్కుతున్నారంటూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి కుంటు పడనీయలేదని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకున్నా.. పేదలకు అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి పంట సాగు చేసిన రైతులకు అన్ని రకాలుగా సహకరించామని గుర్తు చేశారు. తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న వారి పార్టీ లేదని చిన్న చూపు చూడొద్దని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణా రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే తీసుకురావాలని వారికి సూచించారు. ప్రభుత్వానికి సూచనలు చేయాలని రైతులను ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.