కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: ఎస్.జె.కె. అహ్మద్
ABN , Publish Date - Mar 06 , 2026 | 08:49 PM
కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్ విజ్ఞప్తి చేశారు.
పాల్వంచ: సీనియర్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పాల్వంచలో అహ్మద్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు చూపిన ప్రజాసేవా మార్గంలో ఆయన తనయుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) కొనసాగుతున్నారని తెలిపారు. గత 30 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ.. ప్రజాసమస్యల పరిష్కారం దిశగా కోనేరు చిన్ని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం కోనేరు చిన్నికి అప్పగించిన పనుల్లో ఆయన తన సత్తా చాటారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా అహ్మద్ ఆకాంక్షించారు. ఆ క్రమంలో త్వరలో భర్తీకానున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులో కోనేరు చిన్నికి సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సౌమ్యుడు, ప్రజల మనిషిగానే కాకుండా నిత్యం పార్టీ ఆదేశాలు, సిద్ధాంతాలకు కోనేరు సత్యనారాయణ కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆయనకు కేటాయిస్తే.. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. సేవా దృక్పథంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయిస్తే ప్రజలకు సైతం మేలు జరుగుతుందని ఎస్.జె.కె. అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు.