Share News

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి తుమ్మల

ABN , Publish Date - Apr 13 , 2026 | 08:11 PM

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకు ట్రై సైకిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి తుమ్మల
Minister Tummala Distributes Smartphones

ఖమ్మం, ఏప్రిల్ 13: సంక్షేమ పథకాల అమలు, మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా రేవంత్ సర్కారు మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీల సేవలు అమూల్యమని, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 'అంగన్వాడీలకు రాజకీయాలతో పనిలేదు. పేద ప్రజలకు, చిన్నారులకు సేవ చేసే గొప్ప భాగ్యం మీకు దక్కింది. యూనియన్ల పేరుతో గొడవలు చేయడం వల్ల జీవితాలు బాగుపడవు, నిబద్ధతతో పనిచేస్తే మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది' అని మంత్రి చెప్పారు.

స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నేరుగా కంపెనీ నుంచే అతి తక్కువ ధరకే ఫోన్లు కొనుగోలు చేశామని, పారదర్శకత కోసమే ఈ డిజిటల్ విప్లవాన్ని అంగన్వాడీల్లో ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నామని, గతంలో తానే మంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు జీతాలు పెంచిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.


మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన 'ఇందిరా మహిళా శక్తి సంబరాల'లో భాగంగా 500 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మంత్రి వివరించారు. డ్వాక్రా మహిళల కోసం ఈ ఏడాది 23 వేల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. పేదలందరికీ సన్నబియ్యం అందించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు.

ముఖ్యంగా మహిళలు తమ పిల్లల చదువుపై దృష్టి సారించాలని మంత్రి కోరారు. ఖమ్మం జిల్లాలో 3,000 మంది పిల్లలకు గురుకులాల్లో చదువుకునే అవకాశం ఉందని, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి 1.50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఉన్నత విద్య చదివిస్తేనే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..

జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి

Updated Date - Apr 13 , 2026 | 08:41 PM