Share News

గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం.. రైతులకు మంత్రి తుమ్మల పిలుపు..

ABN , Publish Date - Jul 20 , 2026 | 02:01 PM

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురంలో నిర్మించిన గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ కాంప్లెక్స్ నిర్మించడం సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం.. రైతులకు మంత్రి తుమ్మల పిలుపు..
Godrej Oil Palm Factory

ఖమ్మం జిల్లా: కొనిజర్ల మండలం అంజనాపురంలో నిర్మించిన గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గోద్రెజ్ కంపెనీ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ నిర్మించడం సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్‌లో అత్యాధునిక సీడ్ గార్డెన్ ఏర్పాటు చేశారని తెలిపారు. గోద్రెజ్ కంపెనీకి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, రైతులకు అన్ని విధాలా అందుబాటులో ఉండేలా కంపెనీ సేవలందించాలని ఆకాంక్షించారు.


ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ముందు ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కృషి జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులంతా ఈ పంట సాగుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్‌తో ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఆయిల్ పామ్ కింద ఇప్పటికే మూడు ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తయిందని, మరో ఆరు ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణ భూములు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశ నేతలందరూ ఆయిల్ పామ్ దిగుమతిపై సుంకం తగ్గించాలని కోరుతున్నామని మంత్రి చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఆయిల్ పామ్ సాగుతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు మంత్రి తుమ్మల. తన యాభై సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో ఎన్నో పంటలు పండించామని, ఏ పంటకు రాని ఆదాయం దీనికి వస్తుందన్నారు. ఆయిల్ పామ్‌ను ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన నాటి నుంచి తాను కూడా సాగు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, ఎల్‌నినో ప్రపంచాన్ని కబళించే పరిస్థితి ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. దాని కారణంగా రుతుపవనాలు సరిగా రాలేదని, మానవజాతి చేసిన విధ్వంసం తిరిగి మన పాలిటే మహమ్మారిగా మారిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని, ఉద్యానవన పంటల సాగుతో భూములను చల్లబరచాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్

Updated Date - Jul 20 , 2026 | 02:01 PM