పట్టభద్రుల మద్దతు కూడగట్టండి.. కాంగ్రెస్ శ్రేణులకు పొంగులేటి పిలుపు
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:33 PM
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఖమ్మం, అక్టోబర్ 10: జిల్లాలో ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని.. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు పొందేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఓటరుకు వివరించాలని పార్టీ నాయకులు.. కార్యకర్తలకు సూచించారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీపడటం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను రూ.9 వేల కోట్లతో చెల్లించామని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు.. ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పట్టభద్రులకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం