Share News

Kavitha to Form New Party: తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:49 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు....

Kavitha to Form New Party: తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి

  • సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం

  • జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత

  • రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు

  • ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు, ప్రజాసమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె మంగళవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని, సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే తనకు అందరూ మద్దతివ్వాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు 12 ఏళ్లలో ఏ మేరకు సాకారమయ్యాయి? ఇంకా ఏమేం చేయాలి? అనేది నిర్ధారించడానికి వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి సేవలందించాలి? తెలంగాణ ఆవిర్భవించాక ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. జాగృతి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌.రూ్‌పసింగ్‌ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్‌ కమిటీలో సీనియర్‌ జర్నలిస్టులు సయ్యద్‌ ఇస్మాయిల్‌, లోక రవిచంద్ర, జాగృతి సీనియర్‌ నాయకురాలు మంచాల వరలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. ఆయా కమిటీలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై అధ్యయనం చేసి 17న స్టీరింగ్‌ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. జాగృతి స్టీరింగ్‌ కమిటీ ఆయా నివేదికలను అధ్యయనం చేసి కవితకు సమర్పించనుంది. ఆ తర్వాత జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా జాగృతి జనంబాటలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో జాగృతి 23 అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు,ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, కార్మికులు, వివిధ ప్రజా, కులసంఘాల ప్రతినిధులు కవితను కలిసి, ఆమె ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు.


కవిత రాజీనామాకు ఆమోదం

ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం ఆమోదించారు. ఆమె రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ జారీ చే శారు. ఆస్థానం ఖాళీ అయినట్టు ప్రకటించారు. 2021లో నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలి సభ్యురాలిగా కవిత ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన రోజే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్‌ అనుమతితో తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, ఇతర అంశాలను ఆమె మండలిలో సోమవారం వివరించారు. ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని, దాన్ని ఆమోదించాలని కవిత కోరారు. కవిత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఆమె రాజీనామాను ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Jan 07 , 2026 | 04:44 AM