గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క!
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:55 AM
బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు....
బీఆర్‌ఎస్ హయాంలో ఎక్సె్‌సకు టెండర్లు వేయలేదా?
గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు
పెద్దచేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్‌ను బీఆర్‌ఎస్ నిషేధించడం కాదు..ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు
మహేశ్‌గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్‌ను చేస్తా!
మీడియాతో కల్వకుంట్ల కవిత
ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉంటోందన్నారు. ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ గుడ్డిగా గుంతలో పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్‌ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని.. అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. పైగా, ఆయన 2014 నుంచీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనే విచారణ అడుగుతున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్‌లో పడి, అదేవిధంగా విచారణ జరపాలని సర్కారును డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సింగరేణి విషయంలో బీఆర్‌ఎస్ తప్పులే చేయనట్లు మా ట్లాడడం విచిత్రమని, బీఆర్‌ఎస్ హయాంలో అసలు టెండర్లు ఎక్సె్‌సకు పోలేదని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో దాదాపు 25 టెండర్లు పూర్తయితే.. అందులో కొన్నింటిని 16, 7, 8 శాతానికి పైగా ఎక్కువకు ఇచ్చారని ఆరోపించారు. గుంటనక్క ప్రెస్‌మీట్‌ను చూసిన కేటీఆర్ కూడా అవే విషయాలు మాట్లాడుతున్నారని, ఇటీవల ఆయన మాటలు చూస్తుంటే దారుణమనిపిస్తోంద న్నారు. సృజన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ హయాంలోనే సింగరేణి పరిధిలో రెండు కాంట్రాక్ట్‌లు ఇచ్చారని, అప్పు డు ఆయన రేవంత్‌రెడ్డి బావమరిది అని గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. బడా కాంట్రాక్టులు చేసే ఓ తిమింగలాన్ని రక్షించేందుకే గుంటనక్క చిన్నచేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని ఆరోపించారు. సృజన్‌రెడ్డి చిన్నచేప అని, ఆ బడా సంస్థకు రూ.25వేల కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే సింగరేణికి రూ.25 వేల కోట్ల అప్పు పెట్టారని, కాంగ్రెస్ వచ్చాక అది రూ.50 వేల కోట్లయిందని, దీంతో సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన టెండర్లలో హరీశ్‌రావు అండగా ఉండే ఓ సంస్థకూ కాంట్రాక్టు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
దళితులను అవమానించేలా హరీశ్ వ్యాఖ్యలు
సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ రాయనని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే రాస్తానని హరీశ్‌రావు వ్యాఖ్యానించడం మొత్తం దళిత వర్గాలను అవమానించడమేన ని కవిత అన్నారు. గుంటనక్క కేంద్ర మంత్రికి లేఖ రాస్తాననడం వెనక కుట్ర దాగుందని, ఆ గుంటనక్క అడగ్గానే కిషన్‌రెడ్డి ఏదో పేరుతో కమిటీ వేశారని చెప్పారు. సింగరేణిలోని ఏజీఎం ర్యాంక్ అధికారితో కమిటీ వేస్తే ఆయన ఎండీని ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. జాగృతి పక్షాన భట్టి విక్రమార్కకు పలు ప్రతిపాదనలతో లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నైనీ బ్లాక్‌ను సందర్శించేందుకు ప్రత్యేక ప్రతినిధుల బృందం వెళ్లనున్నట్లు ఆమె చెప్పారు.
కేటీఆర్‌పై ఒక నీతి.. మహిళపై ఒక నీతా..?
గతంలో కేటీఆర్ మీద కథనం వస్తే ఆయన అనుచరులు చానెల్‌పై దాడి చే శారని.. అదే ఓ దళిత మ హిళపై కథనాలు ప్రసారం చేస్తే జర్నలిస్టులకు అండగా నిలిచారని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ దృష్టిలో కేటీఆర్‌కు ఒక నీతి, మహిళకు ఒక నీతా? అని ప్రశ్నించారు. ఏమాత్రం అవగాహన లేని యూట్యూబ్ చానెళ్ల మాదిరిగా శాటిలైట్ చానెళ్లలోనూ కథనాలు వేస్తున్నారని, దళి త ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయడంపై తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. గతంలో నిబంధనలను అతిక్రమించిన యూట్యూబ్ చానెల్ వాళ్ల ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి శాటిలైట్ చానెల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై బీఆర్‌ఎస్ నిషేధం విధించడంపై కవిత స్పం దిస్తూ.. వారు ఆ చానెల్‌ను బ్యాన్ చేయడమేంటో కానీ, త్వరలోనే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎ్‌సను బ్యాన్ చేస్తారన్నారు. కాగా, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిందని, మునిసిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తోందని ఆరోపించారు.
ఓడిపోయే కాంగ్రె్‌సలోకి వెళ్తానా..?
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, తెలంగాణలో గెలిచే పార్టీ జాగృతి అని, అలాంటప్పుడు ఓడిపోయే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని కవిత అన్నారు. తాను కాంగ్రె్‌సలోకి వస్తానని అడిగితే వద్దని చెప్పానంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ‘మహేశ్ అన్నా.. మీరు నిద్రలో కలగన్నట్లున్నారు. వాస్తవంలోకి రండి. ఎవరికైనా చూపించుకొని, ఏదైనా బొట్టు పెట్టించుకోండి’ అని కవిత ఎద్దేవా చేశారు. ‘జాగృతిని పటిష్ఠమైన పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నా పనిలో నేను నిమగ్నమై ఉంటే నన్ను బద్నాం చేయాలనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు’ అని చెప్పారు. టీపీసీసీ అఽధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌నే జాగృతిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామని కవిత అన్నారు. ఒకవేళ వస్తే సీనియర్‌గా ఆయనకు జాగృతి జాతీయ కన్వీనర్ పదవిని ఇస్తామని చెప్పారు.