Share News

సింగరేణి సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:08 AM

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల నుంచి రావాల్సిన 54 వేల కోట్ల బకాయిలను సమ్మె చేసి సాధించుకుందామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సీతారామయ్య పిలుపునిచ్చారు. సోమవారం కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఆర్జీ-2, 3 ఏరియాల సర్వసభ్య సమావేశంలో సీతారామయ్య మాట్లాడారు.

సింగరేణి సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలి

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల నుంచి రావాల్సిన 54 వేల కోట్ల బకాయిలను సమ్మె చేసి సాధించుకుందామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సీతారామయ్య పిలుపునిచ్చారు. సోమవారం కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఆర్జీ-2, 3 ఏరియాల సర్వసభ్య సమావేశంలో సీతారామయ్య మాట్లాడారు. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఈ పరిస్థితికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి నిధులను దారి మళ్ళించలేదని తెలిపారు. కేసీఆర్‌ వచ్చాక సింగరేణి విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌ పెడుతూ వచ్చిందని, కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు 50వేల కోట్లు దాటినట్టు సీతారామయ్య పేర్కొన్నారు. నిధుల కొరతతో గడిచిన పన్నెండేళ్ళలో ఒక్క కొత్త గని ప్రారంభం కాలేదని, డంపర్లు, డోజర్లు, షావల్స్‌ను పాత వాటితోనే నడిపిస్తున్నారన్నారు. కార్మికుల హక్కుల కోసం గుర్తింపు సంఘంగా డిమాండ్లు పెడితే యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఆర్థిక ఇబ్బందులతో వాటి అమలును పక్కనబెడుతున్నట్టు పేర్కొన్నారు. సింగరేణి వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం కారణంగా సంస్థ పాలన గాడితప్పిందని తెలిపారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద సింగరేణి నడవదని, కార్మికులు పోరాడితేనే సంస్థ మనుగడ సాధించగలదన్నారు. యూనియన్‌ శ్రేణులు గని స్థాయిలో సమ్మెపై విస్తృత ప్రచారం చేయాలని సీతారామయ్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీలు వైవీ రావు, మడ్డి ఎల్లయ్య, నాయకులు ప్రకాష్‌, రాజారత్నం, అన్నారావు, క్రాంతి, రవీందర్‌ ఎంఆర్‌సీ రెడ్డి, శ్యాంసన్‌, తిరుపతిరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:08 AM