ప్రభుత్వ భూమి కాపాడాలని మహిళల ఆందోళన
ABN , Publish Date - May 19 , 2026 | 12:02 AM
సుల్తానాబాద్ మండలం కనుకులలో అన్యాక్రాంతానికి గురైన 11.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలం టూ కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామం నుంచి 300కు పైగా మహిళలు, పురుషులు కలెక్టరేట్‌కు తరలి వచ్చారు.
పెద్దపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మండలం కనుకులలో అన్యాక్రాంతానికి గురైన 11.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలం టూ కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామం నుంచి 300కు పైగా మహిళలు, పురుషులు కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ఆందోళన నిర్వహించి కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ కర్రె కవిత విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో సర్వే నంబర్ 221లో 101 ఎకరాల 35 గుంటల భూమి ఉందని తెలిపారు. ఈ భూమిలో 11.23 ఎకరాల భూమి తొగ ర్రాయి గ్రామానికి చెందిన ఒంటెల రాజిరెడ్డి, శంకర్‌రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి 1983లో పట్టా చేసుకున్నారని తెలిపారు. కనుకుల సొసైటీలో రుణాలు కూడా తీసుకున్నారన్నారు. కానీ ఆ భూమి బీడుగా ఉందని, కొంత భాగం పశువులు, గొర్రెలను మేపుతారని, కొంత స్థలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నడుస్తున్నదన్నారు. కొంతకాలం తర్వాత భూమిని జిన్న కవితకు విక్రయించారని, వాళ్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులో 61 లక్షల రూపాయలు తీసుకున్నారని పేర్కొన్నారు. బ్యాంకు వాళ్లు ఇటీవల భూమిలో బోర్డు పాతడంతో విషయం బయటపడిందని, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురైనట్లు తెలిసిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపిస్తామని చెప్పారని తెలిపారు.